ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు లీలలు.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు

by Disha Web Desk 13 |
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు లీలలు.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు మూడో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు తెలుస్తున్నాయి. రెండు రోజుల విచారణలో అతడి వద్ద నుంచి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు మంగళవారం మరింత కూపీ లాగినట్లు తెలుస్తోంది. ట్యాపింగ్ డేటాను సేకరించిన హార్డ్ డిస్కులను వికారాబాద్ అడవుల్లో పారేసినట్లు విచారణలో ఒప్పుకున్న ప్రణీత్ రావు.. మొత్తం 42 హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేసినట్లు తాజాగా అంగీకరించినట్లు సమాచారం. ఆ హార్డ్ డిస్క్ లు మరోసారి పనికి రాకుండా కట్టర్లతో పగులగొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అడవుల్లో పడేసిన డివైజ్ లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రణీత్ రావు వెనుక మీడియా సంస్థ యజమాని!:

ప్రమోషన్ల ఆశచూపించి కింది స్థాయి సిబ్బందితో ప్రణీత్ రావు ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిపించారని వరంగల్ తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ బీఆర్ఎస్ నేత ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించిన ప్రణీత్ రావు వెనుక ఓ మీడియా సంస్థ యజమాని కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో మీడియా సంస్థ యజమాని దగ్గరే ప్రణీత్ రావు ఏకంగా సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. మీడియా సంస్థ యజమాని ఇచ్చిన సుమారు 100 నెంబర్లను సైతం ప్రణీత్ రావు ట్యాప్ చేశారని అలా సేకరించిన డేటాను 17 కంప్యూటర్ల ద్వారా ప్రైవేట్ డ్రైవ్ ల్లోకి తీసుకున్నట్లు గుర్తించారు. ప్రణీత్ రావు డైరీ నుంచి వందల సంఖ్యలో ఫోన్ నెంబర్లను గుర్తించిన పోలీసులు.. ఈ పని ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరు చెబితే చేయాల్సి వచ్చిందనే విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ప్రణీత్ తో కలిసి పని చేసిన వారిని ఆరా:

ఈకేసులో కీలక విషయాలపై కూపీ లాగుతున్న దర్యాప్తు అధికారులు ప్రణీత్ తో కలిసి పని చేసినవారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరు సీఐలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారిని రహస్య ప్రాంతానికి తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరు నోరు విప్పితే ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయనేది ఆసక్తిగా మారింది.

Next Story