వ్యాపార ప్రణాళికలు సిద్దం చేసుకోండి.. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2026-06-09 13:11:52  IST  )

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ మహిళా శక్తి మహాసభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యాపార ప్రణాళికలు సిద్దం చేసుకోండి.. మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళలను స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణను పదేళ్లు పరిపాలించిన బీఆర్ఎస్ ఏనాడు తమ పార్టీకి అధ్యక్షురాలిగా మహిళను నియమించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి ఐదేళ్లలో ఒక్క మహిళకూ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. మా ప్రభుత్వంలో ఇద్దరు మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. అమెరికాలో మహిళలకు ఓటు హక్కు వచ్చేందుకు వందల ఏళ్లు పడితే భారత్‍కు స్వాతంత్య్రం రాగానే మహిళలకు ఓటు హక్కు ఇచ్చిన ఘనత నెహ్రు దక్కిందన్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మహిళా శక్తి మహాసభలో మాట్లాడిన సీఎం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు సున్నావడ్డీని ఎగొట్టి పోయిందని ఆడబిడ్డలతో పెట్టుకున్నవారెవరైనా అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. మహిళల పెట్టిన వాతలకు అధికారం దిగిపోయి కొందరు ఫామ్ హౌస్ పడుకుని ఏడుస్తున్నారన్నారు.

2034 వరకు అధికారం మనదే:

అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తే కొంతమంది కడుపునొప్పితో ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారన్నారు. వారితో ధర్నా చేయించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం ఆపేందుకు కడుపులో విషం, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సుతో ఆడపిల్లల డ్రాపవుట్స్ తగ్గాయన్నారు. ఉచిత బస్సు పథకం కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతులో ఉందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదని మీకు ఏం కావాలన్నా చేయడానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ సోదరుడు ఉన్నాడని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానని వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సరఫరా అంతా మహిళలకు అప్పగించే బాధ్యత నేను తీసుకుంటాన్నారు. దళారులు, దోపిడీదారులు, కమిషన్ ఏజెంట్లకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదన్నారు. మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు అధికారంలో మేము ఉంటామన్నారు. మీకు అండగా ఉండే బాధ్యత నాది, సీతక్కది అన్నారు. మహిళా సంఘాలు కొనుగోలు చేసే బస్సులు ఆర్టీలో పెట్టుకునే బాధ్య ఈ ప్రభుత్వానిదని చెప్పారు. అదానీ, అంబానీలు చేసే వ్యాపారం మహిళల చేత చేయిస్తున్నామన్నారు.

Next Story