బీఆర్‌ఎస్‌తో ‌పొంగులేటి వార్!

by Disha Web Desk 4 |
బీఆర్‌ఎస్‌తో ‌పొంగులేటి వార్!
X

దిశ, ఖమ్మం బ్యూరో: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్‌లో ఆయనో చర్చనీయాంశం.. రాష్ట్ర రాజకీయాల్లో సైతం ప్రస్తుతం ఆయన టాపికే నడస్తోంది. అత్యంత ప్రజాధరణ ఉన్న నేత అయి ఉండి అధికార పార్టీలో ఏ పదవీ లేకుండా ఉన్నారు. ప్రస్తుతం పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నాక అధికార పార్టీ టార్గెట్‌గా అదే పార్టీలో ఉండి మరీ మాటల తూటాలు పేలుస్తున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గాల వారీగా నోరువిప్పి జనం ముందుంచుతున్నారు.

ఆయన అనుచరులు, అభిమానులు భారీగా మేమున్నామంటూ స్పందిస్తున్నారు. అయితే ఆయన బీఆర్ఎస్‌లో ఉంటూనే పార్టీ మార్పుపై గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ పెద్దలు ఆయన అనుచరులను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. తాజాగా సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గం ఆత్మీయ సమ్మేళనంలో 'వాళ్లను, వీళ్లను కాదు.. దమ్ముంటే నన్నే సస్పెండ్ చేయండంటూ' బీఆర్ఎస్ పెద్దలకు సవాల్ విసిరారు.

స్పీడ్‌గా గ్రౌండ్ వర్క్...

పొంగులేటి శ్రీనివాస రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. కమలం గూటికి పోతున్నారన్న వాదన బలంగా ఉన్నా.. కాంగ్రెస్, వైఎస్ఆర్టీపీలో ఏదైనా చేరొచ్చని కొందరు అంటున్నారు.. లేదులేదు.. పొంగులేటి తన అనుచరులతో ఇండిపెండెంట్‌గా పోటీచేసి అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీలోనైనా చేరొచ్చని మరికొందరు అంటున్నారు. అయితే పార్టీ మారకముందే పొంగులేటి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నియోజకవర్గాల వారీగా తన అభిమానులు, అనుచరులతో ఆత్మయ సమ్మేళనాలు ఏర్పాటు చేసి విషయాన్ని చెప్పేస్తున్నారు. అంతేకాదు.. తన తరఫున నిలబెట్టే అభ్యర్థులను సైతం సభా వేదికపై ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో తన అనుచరులను తన తరఫున పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటిచండంతో అధికార పార్టీలో అలజడి మొదలైందనే ప్రచారం జరుగుతోంది.

అనుచరులపై వేటు..

పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పొంగులేటితో వెళ్తున్న బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులను అధికార పార్టీ సస్పెండ్ చేస్తోంది. వైరా నియోజకర్గంలో ఇప్పటికే విజయ బాయిని తన తరఫున పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఆయన ముఖ్య అనుచరులు 20మందిపై బహిష్కరణ పడింది. వీరిలో రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ జైపాల్‌ను సైతం బహిష్కరించి.. పార్టీ పదవులనుంచి తొలగించడం చర్చనీయాంశగా మారింది. వీరితో పాటు మరికొంతమందిపై కూడా వేటు పడనుంది.

మరి పొంగులేటిపై లేదా..?

ఏది ఏమైనా అధికార పార్టీనుంచి మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెళ్లిపోడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే ఆత్మయ సమ్మేళనాల పేరిట సభలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పై, ఆ పార్టీ పెద్దలపై పొంగులేటి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇన్నేళ్లుగా తనకు జరిగిన అన్యాయాన్ని విడమరిచి చెబుతున్నారు. తనతో కలిసి నడవాల్సిందిగా అనుచరులు, కార్యకర్తలను కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పొంగులేటి బలమైన నాయకుడు. ఆయనకు పది నియోజకవర్గంలో భారీగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో పొంగులేటిపై బహిష్కరణ వేటు వేస్తే.. అధి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే వాదన ఉంది. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు, పార్టీ క్యాడర్ సైతం అన్ని నియోజకవర్గాల్లో చీలిపోతుందనే భయంతోనే ఆయనపై కాకుండా అనుచరులపై వేటు వేస్తుందనే ప్రచారం జరుగుతోంది.

నన్నే బహిష్కరించండి..

సోమవారం అశ్వారావుపేట నియోజకవర్గంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సన్సేషనల్ కామెంట్స్ చేశారు. 'వాళ్లను వీళ్లను కాదు.. దమ్ముంటే నన్నే సస్పెండ్ చేయాలి' అంటూ సవాల్ విసిరారు. పార్టీలో సభ్యత్యం ఉందో లేదో అని కొందరంటున్నారని సభ్యత్వం లేనప్పుడు డిసెంబర్ నెల వరకు ఫ్లెక్సీలలో, కటౌట్లలో తన ఫొటో ఎందుకు పెట్టారని, ఎన్నికలప్పుడు అభ్యర్థులను గెలిపించాలని తనను ఎందుకు అభ్యర్థించారని ఎదురు ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల సూచనల మేరకే పార్టీ మార్పు తథ్యం అని ప్రకటించారు. చాటలో తౌడు వేసి పశువులను వదిలినట్లు నియోజవకర్గానికి 20, 30 డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తూ అర్హులకు అందకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికీ జిల్లాలో గుడిసెల్లో జీవించేవారి సంఖ్య అధికంగానే ఉందని వ్యాఖ్యానించారు.

Next Story