తెలంగాణ బిడ్డలకు మిగిలింది కన్నీళ్లే: CM కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్

by Disha Web Desk 19 |
తెలంగాణ బిడ్డలకు మిగిలింది కన్నీళ్లే: CM కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అసంతృప్త నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బంగారు తెలంగాణ అని చెప్పి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఫైరయ్యారు. వేలాదిమంది అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో సాధించుకున్న లక్ష్యాలు నెరవేరలేదని.. తెలంగాణ బిడ్డలకు చివరికి మిగిలింది కన్నీళ్లే అని పొంగులేటి ధ్వజమెత్తారు. ఆదివారం పాలేరులో అభిమానులు, కార్యకర్తలతో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత కొంత కాలంగా పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ.. ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినా ఒక్క హామీని నేరవేర్చలేదని.. ధనిక రాష్ట్రం కాస్తా అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారుతాయనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు ఆర్పించిన అమరుల బలిదానాలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన మాటలు మళ్లీ చెప్పి.. ప్రజలను హిప్నాటైజ్ చేయడంలో సీఎం కేసీఆర్ దిట్ట అని.. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని అన్నారు. తాను ఏ జెండా మోసిన.. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన తుది లక్ష్యమని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు రాజకీయంగా సరైన నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed