దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి: బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్

by Disha Web Desk 19 |
దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి: బీఆర్ఎస్‌కు పొంగులేటి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: తన వర్గానికి చెందిన 20 మంది నేతలపై బీఆర్ఎస్ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను వీళ్లను కాదని.. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేతలకు పొంగులేటి సవాల్ విసిరారు. మొన్నటి వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని.. మీ గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాంటిది ఇప్పుడు తనకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉందా అని అంటున్నారని మండిపడ్డారు. మీ కార్యక్రమాల కోసం నన్ను పిలిచినప్పుడు గుర్తుకు రాలేదా నాకు సభ్యత్వం ఉందో లేదో అని ఫైర్ అయ్యారు. డిసెంబర్ దాకా మీ కార్యక్రమాల్లో నా బొమ్మ ఎందుకు వేశారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానులు, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మార్పు అని తేల్చి చెప్పారు.

కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతకొంత కాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ తనకు అన్యాయం చేసిందని బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పొంగులేటి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెబుతారని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూర్చేలా పొంగులేటి పార్టీపై విమర్శలు చేయడంతో పాటు.. అభిమానులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీ మార్పుపై చర్చిస్తున్నారు. కాగా, ఇటీవల పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన నేతలపై బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నెర్ర జేసింది. ఇందులో భాగంగా పొంగులేటి వర్గానికి చెందిన 20మందిపై బీఆర్ఎస్ వేటు వేసింది.

Read more:

బీఆర్‌ఎస్‌తో ‌పొంగులేటి వార్

Next Story