స్వరం మార్చిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్‌లో సడెన్‌గా కొత్త రాగం!

by Disha Web Desk 2 |
స్వరం మార్చిన కేసీఆర్.. ఎలక్షన్ ఇయర్‌లో సడెన్‌గా కొత్త రాగం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పేరుతో నేషనల్ పాలిటిక్స్‌లో చక్రం తిప్పాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ తాజాగా భారీ ప్రకటన చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పంటలను పరీశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి గురువారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడులో మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో పాటు కౌలు రైతులను కూడా ఆదుకుంటామని బిగ్ అనౌన్స్ మెంట్ చేశారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులలో ఆత్మస్థైర్యం నింపేలా ఎకరానికి 10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు. నిజమైన రైతులకే ఈ లబ్ధి చేకూరేలా ఈసారి అందజేస్తున్న పరిహారం విషయంలో కౌలు రైతులను సైతం పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించారు. సీఎం చేసిన ఈ ప్రకటన ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు తెలంగాణలోని కౌలు రైతులు తమ ఎజెండాలో లేరని, భూమిపై పట్టా హక్కులను కలిగిన వారినే రైతులుగా గుర్తిస్తామని ప్రకటిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అనూహ్యంగా గురువారం కౌలు రైతులను ఆదుకుంటామని ప్రకటించడం, అదికూడా ఎన్నికల ఏడాదిలో కౌలు రైతుల పట్ల కేసీఆర్ చొరవ తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కౌలు రైతులను ఆదుకోవాలన్న సీఎం నిర్ణయం సరైనదే అయినప్పటికీ ఈ నిర్ణయం వెనకాల పొలిటికల్ మోటివ్ పై చర్చ జరుగుతోంది.

గతంలో ఇలా:

నిజానికి రాష్ట్రంలో 42 శాతం భూమి కౌలు రైతుల సాగులోనే ఉందని పోయిన సంవత్సరం రైతు స్వరాజ వేదిక జరిపిన స్టడీలో వెల్లడైంది. 20 జిల్లాలోని31 మండలాలకు చెందిన 34 గ్రామాల్లో 7,744 మంది రైతులపై నిర్వహించిన సర్వేలో 35.6 శాతం కౌలు రైతులు ఉన్నట్లు గుర్తించారు. కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం ఇన్నాళ్లు కనీసం పట్టింపు లేనట్లుగా వ్యవహిరించింది. కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న రైతుబంధు, రైతుబీమా, నష్టపరిహారం విషయంలో వీరిని అసలు రైతుగానే గుర్తించలేదు. పంటలు సాగుచేసేది కౌలు రైతులు అయితే పథకాల లబ్ధి భూ యజమానులకు చేరుతోందని ప్రతిపక్షాలు, రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. సబ్సిడీలు సైతం అందక ప్రభుత్వ పరంగా కౌలు రైతులు అనాథలుగా మారారు. దీంతో సర్కార్ సాయం కౌలు రైతులకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ధరణి విషయంలో అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో కౌలు రైతులు అనే కాలమ్ తొలగిస్తున్నామని కౌలు రైతులను పట్టించుకంటే అసలు రైతులకే మోసం వస్తుందని అన్నారు. కౌలు రైతుల విషయంలో ఇంతలా మాట్లాడిన సీఎం.. సడెన్ గా వారిని ఆదుకుంటామని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోందనే మాట వినిపిస్తోంది.

బీఆర్ఎస్ కోసమే కౌలు రైతులు?:

సీఎం కేసీఆర్ కౌలు రైతులకు పరిహారం అనేది ఇటీవల వర్షాలతో ప్రభావితం అయిన పంటల వరకే పరిమితం అవుతుందా లేక భవిష్యత్ లో వారి కోసం ఏదైనా కీలక నిర్ణయం తీసుకోబోతున్నారా అనేది ఆసక్తిగా మారింది. ఈ ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదని రైతు బంధు పేరుతో భూస్వాములకు దోచిపెడుతున్నాడని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి. కేసీఆర్ చెబుతున్న రైతు సంక్షేమ పథకాలతో కౌలు రైతులకు నయాపైసా ఆసరా లేదనే విమర్శలు ఉన్నాయి. ఓ వైపు అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని చూస్తున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో కౌలు రైతులను గాలికి వదిలేశాడనే టాక్ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కౌలు రైతాంగం విషయంలోనూ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ విషయాలన్ని గ్రహించే గులాబీ బాస్ తాజాగా కౌలు రైతుల దిశగా ఆలోచన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ మాటలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల నాటికి కౌలు రైతుల విషయంలో రైతుబంధు అమలు చేయడం లేదా అలాంటి మరో స్కీమ్ ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనే ఊహాగానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

Read more:

రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త

Next Story