''ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో CBI ద్వారానే వెలుగులోకి వాస్తవాలు''

by Disha Web Desk 19 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో CBI ద్వారానే వెలుగులోకి వాస్తవాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో 'సిట్' ప్రతిపాదిత నిందితుల్లో ఒకరైన తుషార్ దాఖలు చేసిన పిటిషన్‌పైన హైకోర్టులో శుక్రవారం జరిగిన విచారణలో ఆయన తరఫు న్యాయవాది దర్యాప్తు ప్రక్రియపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు కేంద్ర ప్రభుత్వం కిందికి వస్తున్నా వారు రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ఈ కేసులో విచారణ కోసం 'సిట్' సీఆర్‌పీసీలోని సెక్షన్ 41-ఏ ప్రకారం తుషార్‌కు నోటీసు జారీచేసిందని, హాజరుకాలేనంటూ సమాచారం పంపినా రిప్లై ఇవ్వకుండా లుకౌట్ నోటీసు జారీచేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరగడంలేదని, రాష్ట్ర ప్రభుత్వ గైడెన్సులో జరుగుతున్నదన్నారు. సీబీఐకు అప్పగించడం ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 'సిట్' ఈ కేసును 'హై ప్రొఫైల్'గా పిటిషన్‌లోనే వ్యాఖ్యానించిందని, దీని వెనక రాజకీయ ప్రయోజనం ఉన్నదని, రాష్ట్రంతో సంబంధం లేకుండా సీబీఐ ఆధ్వర్యంలో జరగడం సమంజసంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నియంత్ర, ప్రభావం లేకుండా స్వతంత్రంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదయ్యాయన్నారు. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు.

ప్రతిపాదిత నిందితుల్లో మరొకరైన బీఎల్ సంతోష్ తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన అనేక విషయాలను ఆడియో, వీడియో క్లిప్పింగులను ఉదహరిస్తూ ముఖ్యమంత్రి వివరించారని, దాని గురించి తాను మళ్ళీ ప్రస్తావించదల్చుకోలేదని, ఆయన జోక్యాన్ని కూడా తాను లేవనెత్తదల్చుకోలేదన్నారు. కానీ కేసు నోదు చేయడంలో పోలీసు అధికారులు చేసిన తప్పులు, ఆ తర్వాత సిట్ దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మాత్రం కోర్టుకు వివరించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఏ దశలో ఎలాంటి పొరపాటు జరిగిందో వివరించి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సమగ్రమైన సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు జరగాలని, సిట్ దర్యాప్తులో పారదర్శకత లేదన్నారు. ఇరు తరఫున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణ సందర్భంగా తెరపైకి వచ్చిన మరికొన్ని అంశాలపై వివరణ తీసుకోవాల్సిన ఉన్నదని వ్యాఖ్యానించి ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.


Next Story

Most Viewed