బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు మరో కీలక నేత గుడ్ బై.. పొంగులేటి బాటలోనే ఉద్యమనేత..?!

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: బీఆర్ఎస్‌కు మరో కీలక నేత గుడ్ బై.. పొంగులేటి బాటలోనే ఉద్యమనేత..?!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి షాక్ తగలబోతోందా?. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీకి దూరం అవుతున్న వేళ తాజాగా మరో కీలక నేత, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కారు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేసిన పిడమర్తి రవి బీఆర్ఎస్‌కు రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రవి బీఆర్ఎస్‌లో ఉన్న అంతర్గత వర్గపోరు కారణంగా పార్టీ నుంచి బయటకు రాబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆయన పొంగులేటి శ్రీనివాస్‌తో కలిసి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.

ఇటీవలే బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి శ్రీనివాస్ బీఆర్ఎస్‌ను దెబ్బతీస్తానని, ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేస్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు పొంగులేటి వైపు వెళ్లగా.. తాజాగా పిడమర్తి రవి సైతం పొంగులేటి బాటలో నడిచేందుకు ఆసక్తితో ఉన్నారనే ప్రచారం గుప్పుమంటోంది.

ఆయనతో పాటు మరి కొంత మంది విద్యార్థి నాయకులు బీఆర్ఎస్‌ను వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా పొంగులేటి‌తో పిడమర్తి భేటీ అయినట్లు ఓ ఫోటో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో ప్రస్తుతానిదా లేక గతంలోనిదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పిడమర్తి రవికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఆయన ఓటమి పాలయ్యారు. మొదటిసారి ఓటమి పాలయిన రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారంపై రవి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Next Story

Most Viewed