గురుకుల నియామకాల్లో వారికి అన్యాయం.. రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌కు వినతి పత్రం

by Disha Web Desk 13 |
గురుకుల నియామకాల్లో వారికి అన్యాయం.. రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌కు వినతి పత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో: గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో పార్ట్ టైం, గెస్ట్, అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు నియామకాల్లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం టీచర్ల ఎమ్మెల్సీ ఏ. నర్సిరెడ్డి, టీఎస్‌యుటిఎఫ్ సీనియర్ నాయకుడు పి మాణిక్ రెడ్డి రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ రోనాల్డ్ రోస్ ను కలిసి వినతిపత్రం అందజేసి చర్చించారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ శాఖల సొసైటీల ఆధ్వర్యంలో నెలకొల్పిన వందలాది గురుకుల విద్యాసంస్థల్లో వేలాదిమంది అర్హత కలిగిన టీచర్లు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్నారని, వారికి గురుకుల ఉపాధ్యాయుల నియామకాల్లో సర్వీస్ వెయిటేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

అన్ని వర్గాలకు చెందిన రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పార్ట్ టైం, మైనారిటీ సంక్షేమ విద్యాసంస్థల్లో ఔట్ సోర్సింగ్ తదితర పేర్లతో తాత్కాలిక ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని, వీరిని మెరిట్, డెమో ఆధారంగా ఎంపిక చేశారని చెప్పారు. ప్రతి సంవత్సరం సామర్థ్యాన్ని పరీక్షించి రెన్యువల్ చేస్తున్నారని పేర్కొన్నారు. పేరుకు పార్ట్ టైం, గెస్ట్, ఔట్ సోర్సింగ్ అయినా వారు పాఠశాలల్లో పూర్తికాలం పనిచేస్తున్నారని తెలిపారు.. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా హౌజ్ మాస్టర్, కేర్ టేకర్, సూపర్వైజర్ స్టడీ, నైట్ స్టే, హాలిడే డ్యూటీ, ఎస్కార్ట్ తదితర అన్ని రకాల విధులను నిర్వహిస్తున్నారని వివరించారు. వారు గురుకుల విద్యాసంస్థల్లోని పని పద్ధతులకు అలవాటు పడి, అనుభవం కలిగి, విద్యార్థులతో అనుబంధం కలిగి ఉన్నారని, కనుక వారి సేవలను గురుకులాల్లోనే శాశ్వత ప్రాతిపదికన ఉపయోగించుకోవటం సమంజసంగా ఉంటుందని అన్నారు. నియామకాల్లో సర్వీస్ ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం అందజేశామన్నారు.


Next Story

Most Viewed