16.8 కోట్ల మంది పర్సనల్ డాటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా

by Disha Web Desk 2 |
16.8 కోట్ల మంది పర్సనల్ డాటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: రక్షణ సంస్థలు, కీలక ప్రభుత్వ శాఖలు, ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను గురువారం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఈ గ్యాంగ్ తస్కరించినట్టు నిర్ధారించారు. ముఠాలో నాగ్ పూర్, ఢిల్లీ, ముంబైకి చెందిన ఏడుగురు నిందితులు ఉన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ తో కలిసి సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు. విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం ఆయా రాష్ర్టాలను అప్రమత్తం చేశామని, దేశవ్యాప్తంగా అరెస్టులు జరుగుతున్నట్టు తెలిపారు.

ముఠా సభ్యులు వీళ్లే..

ఈ కేసులో ప్రధాన నిందితుడు కుమార్ నితేష్ భూషణ్. ఇతను ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో కాల్ సెంటర్ ను స్థాపించాడు. పూజా పాల్, సుశీల్ తోమర్ ఉద్యోగులుగా నియమించుకున్నాడు. ఇన్ స్ప్రైర్ డిజిటల్ పేర సంస్థను నడిపిస్తున్న అతుల్ ప్రతాప్ సింగ్, ఎంఎస్ డిజిటల్ గ్రో సంస్థను నడిపిస్తున్న ముస్కాన్ హసన్ నుంచి క్రెడిట్ కార్డులు కలిగి ఉన్న వారి వ్యక్తిగత డాటాను కొనుగోలు చేస్తూ ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఆరో నిందితుడైన సందీప్ పాల్ గ్లోబల్ డాటా ఆర్ట్స్ పేర సంస్థను ఏర్పాటు చేసి పాల్ జస్ట్ డయల్, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను ఉపయోగిస్తున్న వారి వ్యక్తిగత డాటాను చోరీ చేసి సైబర్ నేరాలకు పాల్పడేవారికి విక్రయిస్తున్నాడు. ఏడో నిందితుడైన జియా ఉర్ రహమాన్ బల్క్ మెసేజింగ్ సర్వీసెస్ ప్రమోషన్ చేయడంతోపాటు నితీష్ భూషణ్, అతుల్ ప్రతాప్ సింగ్లతో తాను సేకరించిన డేటాను పంచుకుంటున్నాడు. ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు విచారణ జరిపి ఈ ఏడుగురిని గురువారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి 12 సెల్ ఫోన్లు, 2 ల్యాప్ టాప్లు, రెండు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. 140 కేటగిరీలకు చెందిన ప్రభుత్వ, ప్రయివేట్ రంగ సంస్థలతోపాటు ప్రజలకు చెందిన సున్నితమైన డాటాను సీజ్ చేశారు. డాటా చోరీకి వీరు బ్యాంకుల్లో పనిచేస్తున్న సిబ్బందిని సైతం ప్రలోభపర్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సైబర్ నేరస్తులకు విక్రయం..

వేర్వేరు మార్గాల్లో చోరీ చేసిన డాటాను నిందితులు సైబర్ నేరస్తులకు లక్షల రూపాయలకు అమ్ముకున్నట్టు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ డాటా ద్వారా సైబర్ క్రిమినల్స్ మోసాలు చేస్తూ రూ. వందల కోట్లను జనం నుంచి కొల్లగొట్టినట్టు చెప్పారు. ఆర్మీకి చెందిన దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగుల డాటా నిందితుల వద్ద దొరకటం ఆందోళనకరమైన అంశమని తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎంక్వయిరీకి సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు కమిషనర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా విచారణ జరపాల్సిన అవసరాన్ని వివరిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా లేఖ రాయనున్నట్టు చెప్పారు.

Also Read...

రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేటీఆర్ లీగల్ నోటీసులు!

Next Story