మునుగోడుకు హైదరాబాద్ నుంచి జనం

by Disha Web Desk 4 |
మునుగోడుకు హైదరాబాద్ నుంచి జనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మునుగోడుకు టీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి జనం తరలిస్తుంది. అక్కడ జనంపై ఫోకస్ పెట్టని టీఆర్ఎస్.. ఇక్కడి నుంచి ప్రజలను తరలిస్తుండటం ఆపార్టీకి ఉన్న ప్రజాధరణను స్పష్టం చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే రెండువేల కార్లతో భారీగా జనంను తరలిస్తున్నారు. మునుగోడు సభలో బలప్రదర్శనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఫోకస్ పెట్టి అందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జనాన్ని తరలించే ప్రణాళికలు చేశారు. అదే విధంగా మునుగోడు నియోజకవర్గంలోని ప్రతిమండలం నుంచి 20వేల మందిని తరలించాలని స్థానిక నేతలకు పార్టీ అధిష్టానం ఆదేశాలుజారీ చేసినట్లు సమాచారం. సభను సక్సెస్ చేసి టీఆర్ఎస్ సత్తాచాటాలని భావిస్తున్నారు.


మునుగోడులో బలప్రదర్శనకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ నెల 20న(శనివారం) నిర్వహించే మునుగోడు సభకు సర్వం సిద్ధంచేసింది. సభకు లక్షన్నరమందిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి రెండువేల వాహనాల్లో జనం తరలించనున్నారు. భారీ కాన్వాయ్ చేపడుతున్నారు. పెద్ద అంబార్ పేట ఓఆర్ఆర్ కు వాహనాలు చేరుకొనున్నాయి. ప్రతికారులో జనంను తరలించనున్నారు. అక్కడి నుంచి కాన్వాయి ప్రారంభమై మునుగోడుకు చేరుకుంటుంది. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు జనసమీకరణ చేస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే సుమారు 200ల వాహనాల్లో తరలించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ 300ల వాహనాల్లో ప్రజలను తరలిస్తున్నట్లు ప్రకటించారు. మునుగోడులో సభ నిర్వహిస్తుండటం, అందుకు హైదరాబాద్తో సహ పలు జిల్లాల నుంచి జనాన్ని తరలిస్తుండటం రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.

ప్రతికారుకు సంబంధిత ఎమ్మెల్యే స్టిక్కర్

ఏ నియోజకవర్గం ఎమ్మెల్యే.. మునుగోడు సభకు ఎన్నికార్లలో జనంను తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు స్టిక్కర్ ను అతికిస్తున్నారు. జనం తరలింపుపై గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ భవన్ లో శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఏ ఎమ్మెల్యే ఎన్ని వాహనాల్లో జనం తరలించాలనే విషయాన్ని చర్చించడం చర్చనీయాంశమైంది. మునుగోడులో సభ అయితే ఇతర ప్రాంతాల నుంచి జనంను తరలించడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మునుగోడులో టీఆర్ఎస్ పై అసమ్మతితో ఉండటమా? లేకుంటే టీఆర్ఎస్ బలం ఏమిటో చూపేందుకేనా? అని ప్రశ్నార్దకంగా మారింది.

ప్రతి మండలం నుంచి 20వేల మంది...

మునుగోడులో నిర్వహించే ప్రజాదీవెన సభకు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. ఈ సభ ఉప ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సన్నద్దమవుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో 6 మండలాలు ఉండటంతో ప్రతి మండలం నుంచి 20వేల మంది తరలించేలా ప్రణాళికలు రూపొందించారు. మండలపార్టీ అధ్యక్షులకు సైతం తరలించే బాధ్యతను అప్పగించారు. అయితే పార్టీలో అసమ్మతి గళం ఉండటంతో నిర్దేశించిన స్థాయిలో జనంను తరలిస్తారో లేదోనని ఇతర నియోజకవర్గాల నుంచి జనంను తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.సీఎం సమక్షంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేర్చుకోనున్నారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలతో పాటు మండలపార్టీ అధ్యక్షులను సైతం గులాబీ గూటికీ ఆహ్వానించనున్నట్లు సమాచారం.

కేంద్రమే టార్గెట్ గా విమర్శలు...

తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై మునుగోడు వేదికగా విమర్శలు కురిపించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా, నిధుల విడుదలలో వివక్ష, విభజన హామీలు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర విధానాలు, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలని చేస్తున్న ఒత్తిడి, ఐటీఐఆర్ ఇలా కేంద్రంపై మండిపడనున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, 8 ఏళ్లలో చేసిన అభివృద్ధి, ఆసరా పింఛన్లు, రైతు సంక్షేమం, ప్రాజెక్టులు, విద్యుత్ సరఫరా, తదితర విషయాలను ప్రస్తావించి చేసిన అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ కు ఓటువేయాలని ప్రజలను కోరనున్నారు. మునుగోడు నియోజకవర్గంలోని డిండి ఎత్తిపోతల పథకం కింద చేపడుతున్న చర్లగూడెం, క్రిష్ణరాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు పరిహారం తదితర విషయాలను ప్రస్తావించనున్నారు. అందరికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు జరిగిన జాప్యంను ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు తెలిసింది.

సీఎం షెడ్యూల్...

మునుగోడు లో శనివారం ప్రజాదీవెన సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం గుండా భారీ కాన్వాయితో వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరుతారు. ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పేట కు చేరుకోగానే గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల కాన్వాయి ఘనస్వాగతం పలుకుతుంది. కేసీఆర్ కాన్వాయితో పాటు సభకు చేరుకుంటారు. పోచంపల్లి ఎక్స్ రోడ్డు, చౌటుప్పల్, నారాయణపురం, చల్మెడ, మునుగోడులోని సభా ప్రాంగణానికి మధ్యాహ్నం రెండు గంటల వరకు చేరుకుంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.



Next Story

Most Viewed