కోటీశ్వరులను కాదు.. ముందు అంగన్వాడీలకు జీతాలివ్వండి.. మాజీ మంత్రి హరీశ్‌రావు

by Ramesh Naini |   (  Updated:2026-06-09 15:45:14  IST  )

మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్‌రెడ్డి మభ్యపెడుతున్నారని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.

కోటీశ్వరులను కాదు.. ముందు అంగన్వాడీలకు జీతాలివ్వండి.. మాజీ మంత్రి హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని రేవంత్‌ రెడ్డి మభ్యపెడుతున్నారని మాజీమంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ముందు అంగన్వాడీలకు జీతాలు చెల్లించి, మహిళలపై ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకో అని సూచించారు. రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్వాడీల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్వాడీలను వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా వారి ఉసురుతగులుందని హెచ్చరించారు. మహిళా మంత్రిగా ఉన్న సీతక్క సాటి మహిళల కన్నీటి గోస అర్థం చేసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అంగ‌న్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.13,650లకు, మినీ అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.7,800లకు, హెల్పర్ల వేతనాన్ని రూ.7,800లకు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించారని తెలిపారు.

అభయహస్తం పేరిట ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో టీచర్ల వేతనాన్ని రూ.18,000లకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రకటించారని.. మాయమాటలు చెప్పి, రెండున్నరేండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీకి అతీగతి లేదని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం, అధికారంలోకి వచ్చాక అబద్ధాలు ప్రచారం చేసుకుంటం అన్నట్లుంది కాంగ్రెస్ వైఖరి అని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చిన అంగన్వాడీలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించిన దుర్మార్గమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరవాలని.. అన్ని వర్గాల ప్రజలు ఛీ కొడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Next Story