ఆర్డర్లు లేక చేనేత కార్మికుల అవస్థలు.. వస్త్రాల ఆర్డర్లను టెస్కోకు ఇవ్వాలి: బాసబత్తిని రాజేశం

by Ramesh Naini |

ఆర్డర్లు లేక.. చేతినిండా పని దొరకకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం తెలిపారు.

ఆర్డర్లు లేక చేనేత కార్మికుల అవస్థలు.. వస్త్రాల ఆర్డర్లను టెస్కోకు ఇవ్వాలి: బాసబత్తిని రాజేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్డర్లు లేక.. చేతినిండా పని దొరకకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బాసబత్తిని రాజేశం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జౌళి శాఖ ఎండీ శైలజ రామయ్యర్‌కు లేఖ రాశారు. నాలుగు రోజులుగా ధర్నాలు, శాంతియుత నిరసనలు నిర్వహిస్తూ ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని తెలిపారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న వృద్ధ మహిళా చేనేత కార్మికురాలు కర్నె శాంతమ్మ పని లేక తీవ్ర మనోవేదనకు గురై మరణించారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికులకు తగిన పనులు లేకపోవడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల యూనిఫాంలు, బెడ్డింగ్ మెటీరియల్స్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాలను టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుతం టెండర్ విధానం అమలు చేయడం వల్ల చేనేత కార్మికులకు పని లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఉన్నత న్యాయస్థానం కూడా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వచ్చే ఏడాదికి అవసరమైన చేనేత వస్త్రాల ఆర్డర్లను ముందుగానే టెస్కోకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన ముడి సరుకులను ముందుగానే అందజేసి, ఉత్పత్తి చేసిన వస్త్రాలను నెలవారీ ప్రాతిపదికన టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని కోరారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యలు, కుటుంబాల దుర్భర పరిస్థితులను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

Next Story