కాంగ్రెస్ డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కేసీఆర్‌కే వేయండి

by Mahesh |
కాంగ్రెస్ డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కేసీఆర్‌కే వేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ నేతలు ఏ నుంచి జడ్ వరకు అక్రమంగా సంపాదించారు.. డబ్బులు ఇచ్చి గెలవాలని చూస్తున్నారు. బలిసి కొట్టుకుంటున్నారు.. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్‌కే వేయండి’ అని మంత్రి పేర్కొన్నారు. రాహుల్ వచ్చినా.. మోదీ వచ్చినా తెలంగాణ అభివృద్ధిని కాదన్నారు. కాంగ్రెస్‌కు ఓట్ల యావ తప్పా.. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణిని బీజేపీ, మోడీ ముంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీలేదని చెప్పుకోవడానికి ఏమీలేదన్నారు. పేదలకు, రైతులకు, మహిళలకు, యువతకు ఏం చేయలేదని ధ్వజమెత్తారు. అటెన్షన్ డైవర్షన్ చేయాలనే ప్రయత్నంను చేస్తుందని ఆరోపించారు. పునర్వీభజనచట్టంలోని ఏ ఒక్క వాగ్దానంను కేంద్రం అమలు చేయలేదని, నిలబెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ తెలంగాణ, ఏపీకు ఏ వర్గానికి చేసిందేమీ లేదు. లోయర్ సీలేరు విద్యుత్ ప్లాంటును ఆంధ్రాలో కలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని కుయుక్తులు పన్నుతోంది. కేసీఆర్ సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినం చేయడం కేంద్రానికి నచ్చలేదన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాగాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. మోదీ దేశాన్ని దోచి అదానీకి కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్విస్ బ్యాంకుల్లో నల్లధనం తెస్తా... పేదలకు 15లక్షల చొప్పున ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.

కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు బంధు పెట్టకున్నా రైతుల అకౌంట్లలో 73వేల కోట్లు జమచేశారన్నారు. కేంద్రం ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు... గొప్పగొప్ప డైలాగులు తప్ప ఆచరణలో అమలు చేయలేదన్నారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు... ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మండిపడ్డారు. అదానీకి దేశ సంపదను దోచిపెడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సిగ్గులజ్జ ఉంటే... దమ్ముంటే.. తెలంగాణపై అభిమానం ఉంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని మోడీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడానికి కిషన్ రెడ్డి దిక్కుమాలిన ధర్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సిలిండర్ ధర పన్నెండు వందలకు పెంచిన మోడీకి డిపాజిట్ రాకుండా చేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

పశ్చిమ బెంగాల్​ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ సినిమాను తీసుకు వ‌చ్చిన బీజేపీ ప్రభుత్వం... కర్నాటక ఎన్నికల్లో కేరళ స్టోరీని దింపింది... ఇక ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు ద‌గ్గర ప‌డుతున్న నేపథ్యంలో ముస్లింలను టార్గెట్​ చేస్తూ.. రజాకార్ సినిమా తీసిందని మండిపడ్డారు. సిలిండర్ ధరలు ఆకాశాన్నంటున్నయంటే మాట్లాడరు... మణిపూర్ అల్లర్లపై మాట్లాడరని, కానీ మతం పేరిట చిల్లర రాజకీయాలు చేసుడే మోడీకి తెలుసు అన్నారు. రజాకార్ల పైల్స్ పేరుతో ఆగాయాలను మళ్లీ ప్రజల మధ్యకు తెవాలని ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉన్నత పదవిలో ఉండి దిగజారుడు రాజకీయాలను మోడీ చేస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేళల్లో దేశానికి చేసిందేమీ లేక భావోద్వేగాలతో బీజేపీ ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగాయన్నారు. మోడీ భ్రమ నుంచి ప్రజలు భయపడుతున్నారన్నారు.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వచ్చి సిగ్గులేకుండా ఒక్క ఛాన్స్ అంటున్నారని, 11సార్లు అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు. నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని వారు ఇక్కడ 4వేల పెన్షన్ ఇస్తామంటే నమ్ముతారా..? కాంగ్రెస్‌లో సీఎం అయ్యేది ఎవరో కూడా గ్యారంటీ లేదన్నారు. అలాంటి పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తోంది... ఆపార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. పొరపాటునో, గ్రహపాటునో కాంగ్రెస్‌కు ఓటేస్తే రాష్ట్రం పాతాళంలోకి వెళ్తుందన్నారు. నీరు, కరెంట్, ఎరువులు, విత్తనాల కోసం క్యూ గ్యారంటీ, రైతుబంధుకు కూడా కాంగ్రెస్ స్వస్తి పలకుతుందన్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి రావడం గ్యారంటీ అన్నారు. మాయమాటలు చెప్పి కర్ణాటకలో అధికారంలోకి వచ్చారని, దళితుల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారని విమర్శించారు. కర్ణాటకలో విద్యుత్ సంక్షోభంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రాహుల్ వచ్చినా.. మోదీ వచ్చినా తెలంగాణ అభివృద్ధిని కాదు.. కాంగ్రెస్‌కు ఓట్ల యావ తప్పా.. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేయలేదన్నారు.

రాజకీయ దివాలాకోరుతనం తప్ప మరొకటి లేదన్నారు. పార్టీ మారిన నేతలకు ఏం అన్యాయం జరిగిందన్నారు. కొంతమంది మనల్ని కాదని వెళ్లిపోయారు... వాళ్ల బాధను ప్రజల బాధగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు ఎవరుపోయినా భయపడొద్దని సూచించారు. త్వరలోనే సీతారామప్రాజెక్టుకు పూర్తి చేసి 10లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తే పుష్కలంగా నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. వీడిపోయి అభివృద్ధికి దూరం కాకండి అని సూచించారు. సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఏగట్టునుంటారో తేల్సుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం-భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగాకాంతారావు, ఖమ్మం పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతామధు, ఎమ్మెల్యే హరిప్రియనాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed