టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి ప్రకటన ఆ రోజే..

by Disha Web Desk 4 |
టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి ప్రకటన ఆ రోజే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 5న టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనుంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ చార్జులకు కేసీఆర్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్ కు ఒక ఎమ్మెల్యేను నియమిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సైతం బాధ్యతలను అధిష్టానం అప్పగించనుంది. అదే విధంగా ఈ నెల చివరివారంలో కేసీఆర్ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దసరా తర్వాత మునుగోడులో టీఆర్ఎస్ జెట్ స్పీడ్ తో ప్రచారం ముమ్మరం చేయనుంది.

దసరా రోజున కేసీఆర్ కొత్తగా జాతీయపార్టీని ప్రకటిస్తున్నారు. అదేరోజున మంచి ముహుర్తం ఉండటంతో మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. పార్టీ బీఫాంను కూడా అందజేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని ప్రచారం జరగడంతో నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. దీంతో అభ్యర్థి ప్రకటన ను అధినేత కేసీఆర్ వాయిదా వేశారు. పలుమార్లు నియోజకవర్గ నేతలతో నిర్వహించిన సమావేశానికి కూసుకుంట్లసైతం పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, కూసుకుంట్లతోపాటు ఆశావాహులపై సైతం సుమారు 40కి పైగా సర్వేలు నిర్వహించారు. అయితే ఆ సర్వేల్లో టీఆర్ఎస్ తో పాటు కూసుకుంట్లకు సానుకూలంగా రావడంతో ఆయనను నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అయినప్పటికీ అధికారంగా మాత్రం అధిష్టానం ప్రకటించలేదు. దసరా రోజూన పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని సోమవారం నియోజకవర్గ ఇన్ చార్జులకు కేసీఆర్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. గెలుపే ధ్యేయంగా పనిచేయాలని, దసరా నుంచి మరింత స్పీడ్ పెంచాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.

కేటీఆర్, హరీష్ రావుకు బాధ్యతలు

నియోజకవర్గంను 86 యూనిట్లుగా విభజిస్తున్నారు. ప్రతి యూనిట్ కు ఎమ్మెల్యేను నియమిస్తున్నారు. ఇప్పటికే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లాపార్టీ ఇన్ చార్జీ రవీందర్ రావుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ముమ్మరప్రచారం చేస్తున్నారు. ఆత్మీయసమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సమ్మేళనాలతో 75వేల మంది ఓటర్లను నేతలను ప్రత్యక్షంగా కలిశారు. మరోవైపు గిరిజనులను హైదరాబాద్ లోని బంజారా భవనకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ప్రతి ఓటు టీఆర్ఎస్ కు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. అదే విధంగా 10శాతం గిరిజనులకు రిజర్వేషన్ పై జీవోను సైతం జారీ చేసింది. మునుగోడు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ప్రతి యూనిట్ కు ఎమ్మెల్యేను నియమిస్తున్నారు. ఆ యూనిట్ పరిధిలో ఉండే ప్రతి ఓటు టీఆర్ఎస్ కు పడేలాప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీరితోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు బాధ్యతలను అధిష్టానం అప్పగిస్తుంది. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. జాతీయపార్టీ పెడుతున్న క్రమంలో ఈ విజయంతోనే దేశంలో నాందిపలకాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.

ఈ నెల చివరిలో కేసీఆర్ సభ!

మునుగోడులో పాగావేసేందుకు టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఆగస్టు 20న కేసీఆర్ సభ నిర్వహించారు. ప్రజలకు దిశానిర్దేశం చేశారు. అయితే నోటిఫికేషన్ రావడంతో ఈ నెల చివరలో కేసీఆర్ సభ నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 3న పోలింగ్ నేపథ్యంలో సభ నిర్వహిస్తే పార్టీ గెలుపు తధ్యమని పార్టీ భావిస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే మునుగోడులో దసరా నుంచే పార్టీ ప్రచారం ముమ్మరం చేయనున్నారు. కూసుకుంట్ల అభ్యర్థిగానే ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఫీల్డ్ లో ఉన్న కూసుకుంట్ల మరింతగా దూకుడు పెంచనున్నారు. అందుకు తగిన ప్రణాళికలను సైతం పార్టీ రూపొందిస్తున్నట్లు సమాచారం.


Next Story

Most Viewed