బీసీ గురుకుల టెండర్‌లలో అధికారుల ఇష్టారాజ్యం..

by Disha Web Desk 4 |
బీసీ గురుకుల టెండర్‌లలో అధికారుల ఇష్టారాజ్యం..
X

దిశ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా పరిధిలోని బీసీ గురుకులాలలో పలు రకాల సరుకులు, చికెన్, మటన్‌, కూరగాయలు సరఫరా కోసం నిర్వహించిన టెండర్లలో అధికారులు ఇష్టా రాజ్యంగా వ్యవహిరస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలను బేఖాతరు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చికెన్, మటన్ సప్లయ్ కోసం పలువురు టెండర్ దారులు వేసిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా అధికారులు ఇష్టానుసారంగా వ్యహరించినట్లు తెలిసింది.

జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో‌నే ప్రభుత్వం ఆదాయానికి గండి పెడుతున్నారు. ప్రభుత్వానికి వారధులుగా, ప్రభుత్వం వైపున ఉండాల్సిన అధికారులే ఇలా వ్యహరించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం ధర తక్కువ కోడ్ చేసిన వారికి ఆయా సరుకుల సప్లయ్ కేటాయింపు చేయాలి. కానీ జిల్లాలో మాత్రం టెండర్ దారులు వేసిన రేట్లను పక్కకి పెట్టి వారే నిర్ణయించిన ధరను ఫైనల్ చేయడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు టెండర్ దారులు మాట్లాడుతూ..

బీసీ గురుకులాలో పలు సరుకులు సరఫరా కోసం మే 26న ఆ శాఖ నుండి టెండర్ ప్రకటన చేయగా, ఈ నెల 7న ముగిసింది. ఈనెల 9న కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సమక్షంలో ఎల్ -1(లిస్ట్ )ఎంపిక చేయాల్సి ఉండగా, టెండర్ దారులు కోడ్ చేసిన ధరలను పరిగణనలోకి తీసుకోకుండా వాళ్లే ఫైనల్ చేశారని ఆరోపిస్తున్నారు.

ఇంతమాత్రానికి ఎందుకు టెండర్ లు ఆహ్వానించారని, వారికి ఇష్టమైన వారికే నేరుగా ప్రకటన చేస్తే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వ్యవహారం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైనలైన టెండర్‌లను రద్దు చేసి, తిరిగి మళ్ళీ నూతనంగా టెండర్‌లను ఆహ్వానించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed