వీధి కుక్కల నియంత్రణకు భారీగా నిధులు.. ఎంతో తెలిస్తే షాకే..!

by srinivas |
వీధి కుక్కల నియంత్రణకు భారీగా నిధులు.. ఎంతో తెలిస్తే షాకే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో కుక్కల నియంత్రణ సవాల్‌గా మారింది. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఫలితం లేకుండా పోయింది. దీంతోపాటు కుక్కల నియంత్రణకు చట్టానికి విరుద్దంగా వ్యవహరించారు. ప్రమాదకరమైన, దీర్ఘకాలికంగా రోగాలబారిన కుక్కలను నియంత్రించడానికి ఉన్న చట్టాలను పట్టించుకోలేదనే విమర్శలూలేకపోలేదు. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడుల్లో మరణించారు. అయితే 2023లో అంబర్ పేట్ నాలుగేండ్ల బాలుని కుక్కల పీక్కుతున్న సంఘటను హైకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు నేపథ్యంలో కుక్కల నియంత్రణ ఖర్చు వివరాలు, ప్రమాదకరమైన కుక్కలను చంపడానికి అనుమతివ్వాలని హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మూడేండ్లలో ఏబీసీ, ఏఆర్ లకు రూ 29.66కోట్లు

కుక్కల నియంత్రణకు ‘కంట్రోల్ ఆఫ్ స్ట్రే యానిమల్స్’ హెడ్ పేరుతో ప్రతి ఏడాది నిధులు కేటాయిస్తున్నారు. స్టెరిలైజేషన్స్, వ్యాక్సినేషన్, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఇతర జంతువుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు మూడేండ్లలో రూ.29.67కోట్లు ఖర్చు చేశారు. యానిమల్ బర్త్ కంట్రోల్(ఏబీసీ), యాంటీ రేబిస్(ఏఆర్) కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయినా 70శాతం కుక్కలకు ఆపరేషన్లు కూడా చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఏడాది ఏబీసీ(కుక్కల సంఖ్య) ఏఆర్ ఖర్చు(రూ.కోట్లలో)

2022-23 36,890 63,025 9.02

2023-24 53,375 86,303 12.84

2024-25 33,395 70,247 7.80

(15డిసెంబర్2024)

ఏడబ్ల్యూఓలకు రూ.9.18కోట్లు

కుక్కల నియంత్రణలో భాగంగా స్టెరిలైజేషన్, యాంటి రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలను నిర్వహించే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్(ఏడబ్ల్యూఓ)లకు జీహెచ్ఎంసీ నుంచి ఆర్థికంగాను, లాజిస్టికల్ గాను సపోర్ట్ చేస్తోంది. ఐదు సంస్థలకు కుక్కల ఆఫరేషన్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐదేండ్లలో రూ.9.18కోట్లు ఖర్చు చేశారు.

ఏడాది ఏబీసీ/ఏఆర్(కుక్కల సంఖ్య) ఖర్చు(రూ.కోట్లలో)

2020-21 9,226 1.38

2021-22 24,720 3.70

2022-23 12,257 1.83

2023-24 8,725 1.30

2024-25 6,474 97లక్షలు

(15డిసెంబర్2024)

మొత్తం 61,402 9.18

గ్రేటర్ లో 1.10కుక్కకాటు కేసులు

జీహెచ్ఎంసీ పరిధిలో 3.79 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటిలో 77 శాతం కుక్కలకు మాత్రమే స్టెరిలైజేషన్ చేస్తున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతోపాటు జీహెచ్ఎంసీ పరిధిలో మూడేండ్ల పాటు 1.10లక్షల కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3.33లక్షలు కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో మూడేండ్ల కాలంలో కుక్కకాటు కారణంగా 36మంది చనిపోయారు.

ఆ కుక్కలను చంపడానికి..

వీధి కుక్కల నియంత్రణకు జీహెచ్ఎంసీ కొత్త పంథాను ఎంచుకుంది. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ యాక్ట్ 1960లోని సెక్షన్ 11(3)(బీ), 11(3)(సీ), జీహెచ్ఎంసీ 1955 చట్టంలోని సెక్షన్ 249 ప్రకారం ప్రమాదకరమైన, దీర్ఘాకాలిక రోగాలబారిన పడిన కుక్కలను యుథానాసియా(మెర్సీ కిల్లింగ్) ద్వారా (కుక్కలకు స్టెరిలైజేషన్ సమయంలో మత్తు ఇంజెక్షన్లను ఎక్కువ మోతాదులో ఇచ్చి చంపడం) చంపడానికి అనుమతివ్వాలని హైకోర్టును కోరింది. అయితే దీనిపై హైకోర్టు ఏలాంటి నిర్ణయం తీసుకుంటనేది చూడాల్సిందే. ఒకవేళ మెర్సీ కిల్లింగ్ కి హైకోర్టు అనుమతిస్తే యనిమల్ వెల్ఫేర్ బోర్డు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. 2008లో బాంబే హైకోర్టు, 2015లో కేరళ హైకోర్టులు కుక్కలను మెర్సీ కిల్లింగ్ కి అనుమతిచ్చాయి. ఈ అంశాన్ని సవాల్ చేస్తూ యానిమల్ యాక్టివిస్టులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ కూడా 2022లో తెచ్చిన ఎనిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ లో మెర్సీ కిల్లింగ్ ను సమర్థించింది.

Next Story