Delhi Liquor Case: మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? ఈడీ అధికారులపై BRS MLA సీరియస్

by GSrikanth |
Delhi Liquor Case:  మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? ఈడీ అధికారులపై BRS MLA సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్త స్పందించారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికే నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. మహిళా దినోత్సవం రోజున మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళలను అగౌరవ పర్చడానికి ఇంతకంటే వేరే ఉంటుందా? అన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించి గౌరవించుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వమని గుర్తుచేశారు. రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతుంటే ఇలా చేయడం సమంజసమేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల క్రితమే కవిత ప్రకటించారని అన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇది జరుగుతున్నదని అభిప్రాయపడ్డారు. నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టడం లేదు. విచారించవచ్చు. కానీ ఎంచుకున్న తేదీ, సందర్భంపైనే మాకు అభ్యంతరం ఉన్నది. కోర్టుల్లో విచారణ తర్వాత నిజమేంటో తెలుస్తుందని అన్నారు.

సీఎం కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికే ఇదంతా జరుగుతున్నదని తెలిపారు. ఈ ఒక్కరోజులోనే మొత్తం ఎంక్వయిరీని, దర్యాప్తును ఈడీ పూర్తి చేసేస్తుందా? అని అడిగారు. మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీ చేసి మొత్తం మహిళా జాతిని ఈడీ కించపరిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకే ఇది జరుగుతున్నదని ఆరోపించారు. సీబీఐ, ఈడీ ఎంక్వయిరీకి ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటానని స్వయంగా కవిత ఇటీవల ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా చెప్పారు. అయినా దర్యాప్తులో భాగంగా పిలిస్తే హాజరై వివరాలన్నీ ఇస్తామని చెప్పారు. మహిళా దినోత్సవం రోజున నోటీసులు జారీ చేసి బెదిరించే ప్రయత్నమేనని స్పష్టమవుతున్నదని మండిపడ్డారు.

Read more:

ఢిల్లీ లిక్కర్ స్కామ్: MLC కవితకు ఈడీ నోటీసులు

‘దేశం ముందు తెలంగాణ సిగ్గుతో తలవంచుతోంది’...MLC కవిత వ్యాఖ్యలపై ఎంపీ అర్వింద్ సీరియస్

Next Story

Most Viewed