అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు.. మాట విననివారిపై పరోక్షంగా వేటు

by Disha Web Desk 12 |
అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు.. మాట విననివారిపై పరోక్షంగా వేటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మొదలైన అసంతృప్తులను చల్లార్చేందుకు పదవులను ఎరగా వేసేందుకు బీఆర్ఎస్ పెద్దలు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు లీడర్లకు నామినేటెడ్ పదవులు దక్కగా త్వరలో మరికొంత మందికి పోస్టులను ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే పార్టీ మారేందుకు రెడీ అవుతున్న అసంతృప్తి లీడర్లను శత్రువులుగా చూస్తూ వారి అనుచరుల వ్యాపారాలను కట్టడి చేయడం, ఉద్యోగులుగా ఉన్న సమీప బంధువులను అప్రాధాన్య పోస్టుల్లో పంపిస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలక నేతలకు ప్రయారిటీ..

అసంతృప్తితో రగిలిపోతున్న టికెట్ దక్కని లీడర్లను పదవులతో బుజ్జగించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం ఉంది. ఏ నియోజకవర్గంలో ఏ లీడరు అసంతృప్తితో ఉన్నారు? పార్టీ మారితే ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనే అంశాలపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. పార్టీ అభ్యర్థి గెలుపోటములను నిర్ణయించే శక్తి ఉన్న అసమ్మతి లీడర్లకు ప్రయారిటీ ఇవ్వాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు సమాచారం. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పదవులను అసమ్మతి లీడర్లతో భర్తీ చేసే చాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇప్పటికే ఆ కోటాలో నామినేటెడ్ పదవులు ఇస్తున్నట్టు టాక్ మొదలైంది. వేములవాడ టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ గుర్రుగా ఉన్నారు. ఆయన సహకారం లేకుండా అక్కడ పార్టీ అభ్యర్థి గెలుపు కష్టమన్న అంచనాతో, ఆయనకు వ్యవసాయ సలహాదారు పదవి కట్టబెట్టారు. పటాన్ చెరు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పదవి అప్పగించినట్టు ప్రచారం ఉంది.

‘బొంతు’కు చైర్మన్ పదవి..?

ఉప్పల్ టికెట్ ఇవ్వకపోవడంతో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన సహకారం లేకుండా ఉప్పల్ లో గెలుపు కష్టమని అభిప్రాయానికి పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది. యూఎస్ టూర్ లో ఉన్న కేటీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే బొంతుకు మున్సిపల్ శాఖ పరిధిలోని ఓ కీలక నామినేటెడ్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలోని వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఓ బీఆర్ఎస్ లీడర్ కల్వకుర్తి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే మళ్లీ టికెట్ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్న ఆయనకు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.

పార్టీ మారే లీడర్లపై ఎటాక్..

టికెట్ రాలేదని అసంతృప్తితో పార్టీ మారేందుకు సిద్ధమైన లీడర్లను ప్రభుత్వం టార్గెట్ చేయడం మొదలు పెట్టినట్టు విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ లోకి వెళ్తున్నట్టు ఖానాఫూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆమె అల్లుడి పై బదిలీ వేటు పడినట్టు ప్రచారం జరుగుతున్నది. మహబూబాబాద్ ఎస్పీగా ఉన్న శరత్ చంద్ర పవార్ ను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి, పోలీస్ అకాడమీకి అటాచ్ చేశారని విమర్శలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శ్రీహరి రావు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రభుత్వం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేస్తున్న ఆయన సమీప బంధువును అక్కడి నుంచి తప్పించినట్టు విమర్శలు వచ్చాయి.

Next Story