పొంగులేటి పాత్రపై నో క్లారిటీ.. అసలు టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?

by Disha Web |
పొంగులేటి పాత్రపై నో క్లారిటీ.. అసలు టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
X

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ వద్దనుకుంటుందా? లేదా పొంగులేటే పార్టీని వద్దనుకుంటున్నారా? అసలు టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? శీనన్న మదిలో ఏముంది? ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ చర్చ తీవ్రంగా జరుగుతోంది. బుధవారం రాజ్యసభ అభ్యర్థులు ఖరారు కావడం.. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరికి అనూహ్యంగా చోటు దక్కడం.. అందులో పొంగులేటి పేరు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. కావాలనే తమ నాయకున్ని అధిష్టానం దూరం పెడుతుందని కొందరు అనుచరులు అంటుంటే.. లేదు శీనన్న నిర్ణయం మేరకే పదవికి దూరమయ్యారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా పొంగులేటికి పదవులు మాత్రం ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తుండటంతో కొత్త చర్చకు దారితీస్తుంది.

దిశ ప్రతినిధి, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు. అతికొద్ది కాలంలోనే తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నేత. రాజకీయ అరంగేట్రం నుంచే జిల్లాలో మంచి పేరు సంపాదించుకున్న పొంగులేటి వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి మూడు అసెంబ్లీ స్థానాల్లో తన వాళ్లను గెలిపించుకున్నాడు. అనంతరం జరిగిన పరిణామాలతో టీఆర్ఎస్‌లో చేరి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేశాడు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి కొన్ని అనివార్య కారణాలవల్ల మొండిచేయి చూపినా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాడు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో తన అనుచరులను కాపాడుకుంటూ వస్తున్నాడు.

బుజ్జగింపులతోనే సరి..

సిట్టింగ్ ఎంపీగా ఉన్నా.. పోటీ చేసే పరిస్థితి లేకపోవడం.. నాటి ఈక్వేషన్ల కోసం అధిష్టానం తప్పకుండా త్వరలోనే అవకాశం కల్పిస్తామని చెప్పడంతో పొంగులేటి ఆశావహుల జాబితాలోకి చేరిపోయారు. స్వయంగా సీఎం కేసీఆర్.. యువనేత కేటీఆర్ భరోసా ఇచ్చారని కూడా ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీగానో, రాజ్యసభ అభ్యర్థిగానో పంపిస్తారనే ప్రచారం జోరుగా సాగినా అవకాశం మాత్రం దక్కలేదు. దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి అవకాశం రాకపోవడం, అతని అనుచరులు కూడా పార్టీపై గుర్రుగా ఉన్నారనే సంకేతాలు వెలువడ్డాయి. దీనికి తోడు జిల్లా నేతలతో కూడా పరిస్థితి ఉప్పు నిప్పులా మారింది. జిల్లాలోని పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేటీఆర్.. ప్రతీసారి బుజ్జగింపులతోనే సరిపెట్టారనే ప్రచారం జరుగుతోంది. తప్పకుండా తగిన గుర్తింపు లభిస్తుందని, అప్పటి వరకు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు చెప్పినట్లు సమాచారం.

పార్టీ మారాలని ఒత్తిళ్లున్నా..

ఒక దశలో పొంగులేటిని పార్టీ మారాలని అనుచరులు సూచించినా ఎక్కడా తలొగ్గలేదు.. గులాబీ పార్టీలో ముళ్లు గుచ్చుకుంటున్నా అందులోనే ఉంటానని శ్రేణులకు సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ అధిష్టానాలు ఆఫర్ చేసినా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. పార్టీ మార్పు పక్కకుపెడితే.. టీఆర్ఎస్ నుంచే తప్పకుండా మంచి అవకాశం దక్కుతుందనుకున్న పొంగులేటికి ఈ సారి కూడా మొండిచేయి చూపడంతో భవిష్యత్ రాజకీయాలు రసవత్తంగా మారుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కేటీఆర్ కు సన్నిహితంగా..

అధినేత కేసీఆర్ పొంగులేటిపై ఒకింత ఆగ్రహంగా ఉన్నారనే ప్రచారం జరిగినా.. కేటీఆర్‌కు మాత్రం సన్నిహితంగా మెలిగారు. ఎప్పటికప్పుడు ఆయనతో టచ్‌లో ఉంటూ జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఖాళీ అయిన రాజ్యసభ సీట్లలో తనకూ అవకాశం దక్కుతుందని భావించారు. కేటీఆర్ సానుకూలంగా ఉండటంతో రాజ్యసభ పక్కా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల కిందట కేటీఆర్‌ను కలిసి తన అభ్యర్థిత్వంపై చర్చించినట్లు కూడా సమాచారం. కేటీఆర్‌తో చర్చల అనంతరం సీఎం కేసీఆర్‌ను కూడా కలుస్తారని ప్రచారం జరిగింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాజ్యసభ ఇస్తామంటే.. వద్దన్నాడనే వార్తలు కూడా షికారు చేశాయి. ఖరారైన అభ్యర్థుల జాబితాలో పొంగులేటి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, రాజ్యసభ సీటును పొంగులేటి వద్దంటున్నాడనే ప్రచారం మొదలైంది. నిజానికి పొంగులేటి వద్దన్నాడా? రాష్ర్ట రాజకీయాల్లోనే ఉండాలనుకున్నాడా? లేక పార్టీ పెద్దలే ఇష్టం లేక పొమ్మనలేక పొగపెడుతున్నారా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఈ సారి భంగపాటు ఎటు దారితీసేనో..

మూడేళ్లుగా పొంగులేటి ఏ పదవి లేకుండా ప్రజల్లో ఉండటం.. డక్కా మొక్కీలు తినుకుంటూ తన అనుచరులను కాపాడుకోవడం.. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం పొంగులేటికి భారంగానే పరిణమించింది. అయితే అధిష్టానం నిర్ణయాలు వేరుగా ఉండటం.. అనుచరులు అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ సారి తప్పకుండా ఏదో ఒక నిర్ఱయం తీసుకోవాలని కోరుతున్నారు. ప్రతిసారి భంగపడుకుంటూ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని. ఏదో ఒక దారి చూసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే పొంగులేటి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీలో ఉండేందుకే ప్రయత్నిస్తున్నారని, తప్పకుండా మంచిరోజులు వస్తాయనే అశాభావం వ్యక్తం చేస్తున్నరని అత్యంత సన్నిహితులు అంటున్నారు. కానీ శీనన్న అంతరంగం మాత్రం ఎవ్వరికీ అర్థం కావడం లేదని.. భవిష్యత్‌లో ఏమిచేస్తారో వేచిచూడాల్సిందేనని మరికొందరంటున్నారు.

Next Story

Most Viewed