తూతూ మంత్రంగా జెడ్పీ సమావేశం

by Sridhar Babu |
తూతూ మంత్రంగా జెడ్పీ సమావేశం
X

దిశ, కామారెడ్డి : జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్​పర్సన్ శోభ రాజు అధ్యక్షతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించగా తూతూ మంత్రంగా జరిగింది. ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభం కావాల్సి ఉండగా గంటన్నర ఆలస్యంగా మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమై కేవలం 45 నిమిషాల్లోనే ముగిసింది. సభలో 22 మంది జెడ్పీటీసీ సభ్యులు పాల్గొనాల్సి ఉండగా కేవలం 11 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారు. సమావేశపు ఎజెండాలో 55 అంశాలను చేర్చారు. ఎజెండా వారీగా చర్చించాల్సి ఉండగా కేవలం 6 శాఖలపైనే నామమాత్రంగా చర్చ నిర్వహించారు. శాఖలపై ప్రశ్నించే సభ్యులు లేక మధ్యలోనే సమావేశాన్ని ముగిస్తున్నట్లు జెడ్పీ చైర్​పర్సన్ తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు చూపుతారనుకున్న ప్రజాప్రతినిధులు కనీసం సమావేశాలకు హాజరు కాకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆరు శాఖలపై మాత్రమే చర్చ

సమావేశం ప్రారంభం కాగానే డీఆర్డీఏ శాఖపై చర్చ మొదలైంది. ఆ తర్వాత ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, మత్య్స శాఖ, పశువైద్య శాఖ, వ్యవసాయ శాఖలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ముఖ్యమైన శాఖలను చర్చ లిస్టులో చేర్చకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అవిశ్వాసం ఊసెత్తని సభ్యులు

మూడు రోజుల క్రితం కామారెడ్డి శివారులో సుమారు 20 మంది జెడ్పీటీసీలు రహస్య సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగింది. అయితే సభకు పూర్తిస్థాయిలో సభ్యులు రాకపోవడంతో అవిశ్వాసం ఊసెత్తలేదు. ఈ విషయమై ఓ జెడ్పీటీసీ సభ్యుడిని వివరణ కోరగా చైర్మన్, వైస్ చైర్మన్ విషయంలో కొంత సందిగ్దత నెలకొందని, త్వరలోనే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

వచ్చామా...వెళ్లామా

మూడు నెలలకు ఒకసారి జరిగే జెడ్పీ సమావేశాల తీరు వచ్చామా.. .వెళ్లామా అనే రీతిలో సాగుతున్నాయని సభ్యులు పెదవి విరుస్తున్నారు. ప్రజాసమస్యలపై పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది అని సభకు వస్తే నాలుగైదు శాఖలపై మాత్రమే చర్చ జరిపి సమావేశం ముగిసిందని చెప్పడం ఆనవాయితీగా మారుతుందని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సమస్యలను ఏకరువు పెట్టిన సభ్యులకు అధికారుల నుంచి స్పందన రావడం లేదని ఆరోపిస్తున్నారు. దాంతో సమావేశానికి వచ్చి కూడా లాభం లేకుండా పోతుందని వాపోతున్నారు.

ఫోన్లలో ఉన్నతాధికారులు బిజీ

ఒకవైపు జిల్లాలోని సమస్యలపై సమావేశంలో చర్చ జరుగుతుండగా మరోవైపు జిల్లా ఉన్నతాధికారులు ఫోన్లలో బిజీగా గడిపారు. సమావేశాలతో మాకేంటి సంబంధం అన్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు హోదాలో ఉండి ఫోన్లలో నిమగ్నమై తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ సమస్యలను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు అధికారులపై వస్తున్నాయి. తమ శాఖకు సంబంధించి చర్చ అయిపోగానే హమ్మయ్య అంటూ తీరిగ్గా ఫోన్లలో లీనమైపోతున్నారు.



Next Story

Most Viewed