రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు

by Disha Web Desk 20 |
రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు
X

దిశ, బోధన్ : బోధన్ పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ గేట్ ముందు ఫ్యాక్టరీ కార్మికులు కుటుంబ సభ్యులతో ధర్నా నిర్వహించారు. ముందుగా అమరులైన కార్మికులకు నివాళులర్పించిన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రభుత్వం లే ఆఫ్ విందించి 8 సంవత్సరాలు కావస్తున్నా 80 నెలల నుండి జీతాలు చెల్లించలేదని మండిపడ్డారు. దీనితో తామంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందారు. పిల్లల ఫీజులు కట్టలేక, ఎదిగిన పిల్లల పెళ్లిళ్లు చేయలేక, అప్పుల బాధలు ఎక్కువవడంతో ఉన్న ఇల్లును అమ్ముకొని రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.

బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ ను ఎన్నిసార్లు కలిసినా నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. మీరు ఆందోళన చెందకండి మీకు రావాల్సిన బకాయిలను చెల్లించేలా చేస్తాను అని చెప్పుకుంటూ కాలయాపన చేస్తు మమ్మల్ని మోసం చేస్తున్నాడన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కార్మికులను ఆదుకోకపోతే ఆందోళనలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాకు మద్దతుగా బోధన్ బీజేపీ పార్టీ నాయకులు మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి మద్దతు తెలిపారు.

అనంతరం చనిపోయిన వారికి నివాళలర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు పనిలేక పస్తులుంటూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. కొందరైతే ఆరోగ్యం క్షిణించి అమరులైతున్నారన్నారు. పిల్లలకు ఫిజులు కట్టలేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. 8 సంవత్సరాలుగా న్యాయంకోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ రోజు ఫ్యాక్టరీ ప్రధానగేట్ ముందు బైఠాయించి ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడపాటి ప్రకాష్ రెడ్డి, రేంజల్ జెడ్పీటీసీ విజయ సంతోష్, టౌన్ ప్రెసిడెంట్ బాలరాజు, మండల్ ప్రెసిడెంట్ పోశెట్టి, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story