టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఆత్మీయ సమావేశాలు కాదు, ఆత్మవంచన సమావేశాలు..

by Disha Web Desk 20 |
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఆత్మీయ సమావేశాలు కాదు, ఆత్మవంచన సమావేశాలు..
X

దిశ, భీమ్‌గల్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నది ఆత్మీయ సమావేశాలు కాదు, అవి ఆత్మవంచన సమావేశాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం అమీనాపూర్ గ్రామంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లాకాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరుగుతూ రాహుల్ గాంధీ సందేశ కరపత్రాలు పంపిణీ చేసి, గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను వంచిస్తున్నాయని అన్నారు.

ప్రజల జీవితాలను మెరుగు పరచాల్సిన నరేంద్ర మోడీ, కేసీఆర్ ప్రజల జీవన ప్రమాణాలను ఇబ్బందికర పరిస్థితులకు నెట్టివేస్తున్నారని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ బిల్లు, ఆర్టీసీ చార్జీలు, గ్యాస్ సిలిండర్ ధరలన్నింటినీ ఆకాశాన్ని అంటిస్తు అదే విధంగా మద్యం ధరలు, రోగులు వేసుకునే మందుల మీద, పన్నుల మీద పన్నులు వేసి ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చివరకు మహిళలు పెట్టుకునే కుంకుమ బొట్టు పైన 18% జీఎస్టీ వేసి నరేంద్ర మోడీ, మహిళల రుణాల పై వడ్డీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కేసీఆర్, ఈ విధంగా పోటీపడుతున్న బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నారని అన్నారు.

నిన్నటి వరకు టీఆర్ఎస్ కార్యకర్తల మొహం కూడా చూడని ఎమ్మెల్యేలు ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం పై చూపుతున్న వ్యతిరేకతను గుర్తించి కార్యకర్తలను ఆత్మీయ సమ్మేళనం పేరుతో కలుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వేణు రాజ్, ఇంద్ర గౌడ్, స్వరూప, బాజన్న, కుక్నుర్ రవి, మోహన్, జాను, రాజేందర్, మల్లేష్, గంగన్న, ఎన్ఎస్యుఐ నాయకులు అఖిల్, అష్రాఫ్, ఆదిత్య, శివ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed