ఎల్ఐసీని నిర్వీర్యం చేసే కుట్రలు సాగనివ్వం: మోహన్ రెడ్డి

by Disha Web Desk 11 |
ఎల్ఐసీని నిర్వీర్యం చేసే కుట్రలు సాగనివ్వం: మోహన్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎల్ఐసీని నిర్వీర్యం చేసే కుట్రలను సాగనివ్వబోమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేశ వేణు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నిజామాబాద్ ఎల్ఐసీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో అదాని గ్రూపుల పైన జాయింట్ కమిటీ ఏర్పాటు చేయాలని, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే మూడు రోజులుగా కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు.

అదానీ గ్రూప్ లలో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీ, ఎస్పీఐలలో పెట్టుబడులు పెట్టించి సామాన్య ప్రజల ధనం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నరేంద్రమోడీ దేశంలో ప్రజల సొమ్మును ఆయన మిత్రుడైన అదానికి అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అదాని ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆదానీ ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు న్యాయవాది ఆధ్వర్యంలో అదానీ గ్రూపులపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.


Next Story

Most Viewed