బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించే వారి పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నాం : కల్వకుంట్ల కవిత

by Kalyani |
బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరించే వారి పేర్లు పింక్ బుక్ లో రాస్తున్నాం : కల్వకుంట్ల కవిత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ ఏప్రిల్ 15: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లొద్దని కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు తెలిసిందని, ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ల పేర్లన్నింటినీ పింక్ బుక్ లో రాసుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వెళ్లే వారిని అడ్డుకునేందుకు, వారిని సభకు వెళ్లకుండా చేసేందుకు బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వారిని ఎవరెవరు బెదిరిస్తున్నారో తమకు తెలుసని వాళ్ల పేర్లను బరాబర్ పింక్ బుక్కులో రాసుకుంటామని కవిత అన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టేదే లేదని, కేసులు పెట్టించే వారిని పోలీస్ స్టేషన్లకు ఈడ్చిన వాళ్లను క్షమించే ప్రసక్తే లేదని కవిత కాస్త ఘాటుగానే హెచ్చరించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే కాంగ్రెస్ నాయకులు, అధికారులు ఎవరైనా ఊరుకునేదే లేదన్నారు.

కాంగ్రెస్ నాయకుల తాటాకు చప్పుళ్లకు ఇక్కడ భయపడేవారెవరూ లేరని ఆమె అన్నారు. కాంగ్రెస్ వాళ్ల తాతలు, ముత్తాతలు, జేజమ్మలు ఎవరు దిగొచ్చినా కూడా భయపడేవాళ్లు ఎవరూ లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాట తప్పడం... మడమ తిప్పడమే కాంగ్రెస్ నైజమని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతకాలు పెట్టిన గ్యారెంటీ కార్టులను కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి పంచి ఓట్లేయించుకున్నారని కవిత గుర్తు చేశారు. ఇప్పుడు గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని, గతంలో తెలంగాణ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ పదేళ్ల పాటు అరిగోస పెట్టిందని కవిత అన్నారు. వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీ, ఏడాదిన్నర పాలనలోనే ఇంత వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆమె వెటకారంగా మాట్లాడారు.

ప్రతీ ఇంటి నుంచి ఒకరు రజతోత్సవ సభకు రావాలని కోరారు. తెలంగాణ గడ్డ మీద అగ్గి పుట్టించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదన్నారు. ఆంధ్రుల పాలనలో నలిగిపోయిన ఆత్మగౌరవాన్ని తెలంగాణలో తిరిగి రెపరెపలాడించింది బీఆర్ఎస్ పార్టీయేనని కవిత ఘంటాపథంగా చెప్పారు. స్వతంత్ర దేశంలో లక్ష్యాన్ని చేరిన ఏకైక పోరాటం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఉద్యమం మాత్రమేనన్నారు. వీరులు మాత్రమే లక్ష్యం చేరే వరకు పోరాటం చేస్తారని, అది ఒక్క కేసీఆర్ తోనే సాధ్యమైందని కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పంథాను నమ్ముకొని హింసాయుతంగా పోరాటం చేసి తెలంగాణను సాధించామని కవిత గుర్తు చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ మొదటి అడుగు వేశారని, కేంద్ర మంత్రి పదవిని సైతం గడ్డిపోచలా వదిలేసిన ఘనత కేసీఆర్ దన్న విషయం తెలంగాణాలోఏ చెట్టునూ, పుట్టను అడిగినా చెపుతాయని కవిత అన్నారు.

తెలంగాణ అనేది ఎవరో భిక్షపెడితేనో, ఎవరో దయదలచి ఇస్తేనో రాలేదన్నారు. కేసీఆర్ త్యాగం, కృషి, పోరాట పటిమ వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో కటిక చీకటి వస్తుందని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అని, తెలంగాణ ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వెలుగు జిలుగు, వెలుగుల తెలంగాణను తయారు చేసుకున్నామని కల్వకుంట్ల కవిత అన్నారు. కోటి ఎకరాల మాగాణను తయారు చేసుకున్నామని, సాగునీటిపై పన్నును మాఫీ చేసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి అనేక కార్యక్రమాలను కేసీఆర్ చేపట్టారని, చివరి గింజ వరకు వడ్లు కొని చరిత్ర సృష్టించింది కేసీఆర్ఒక్కరే అని కల్వకుంట్ల కవిత అన్నారు.



Next Story

Most Viewed