మళ్ళీ ఊపందుకున్న మంచిప్ప రిజర్వాయర్ రగడ..

by Disha Web Desk 20 |
మళ్ళీ ఊపందుకున్న మంచిప్ప రిజర్వాయర్ రగడ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి మున్సిపల్ డ్రాప్ట్ ప్లాన్ లో ఇండస్ర్టీయల్ జోన్ గా వ్యవసాయ భూములను చూపడాన్ని నిరసిస్తు 50 రోజుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి డ్రాప్ట్ ప్లాన్ వేనక్కి తీసుకోవడం నిజామాబాద్ జిల్లా రైతులను కదిలించింది. ఎలాంటి డిటైల్డ్ ప్రాజేక్ట్ రిపోర్టు లేకుండానే మంచిప్ప రిజార్వాయర్ ను నిర్మించడం పై రైతులు మండిపడుతున్నారు. గత ఎడాది నిజామాబాద్ రైతుల పోరాటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లే తగ్గి మళ్లీ పనులు చేస్తుండటంతో అందోళన బాట పట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు.. కోటీ ఎకరాలకు సాగునీరు....అదో ఇంజనీరింగ్ అద్బుతం...ఇదంతా చెప్పుకోవటానికి బాగానే ఉన్నా... ఆ ప్యాకేజీలో భాగంగా చేపడుతున్న రిజర్వాయర్ల నిర్మాణం పై రగడ నెలకొంటోంది. ఈ పాటికే రిజర్వాయర్ కోసం భూములు ఇచ్చి, కూలీలుగా మారిన రైతుల పరిస్ధితిని చూసి నిర్వాసితులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. కొత్త ఇళ్లు నిర్మించాలన్నా జంకుతున్నారు ఆ గ్రామస్ధులు. కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21 ప్యాకేజీ పనులు ఉమ్మడి రాష్ట్రంలో మొదలయ్యాయి. ప్రాణహిత-చేవెళ్ల కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 20, 21, 21ఏ, 22 ప్యాకేజీలను చేపట్టారు. సొరంగ మార్గం పనులను పూర్తి చేశారు.

ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ పై ఆధారపడి నిర్మించిన ఈ ప్యాకేజీల ద్వారా ఉమ్మడి జిల్లా పరిధిలో అదనంగా సుమారు 2లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్దం చేశారు అధికారులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక.. ఈ ప్యాకేజీలను కాళేశ్వరం ప్రాజెక్టు పథకంలో కలిపారు. కాల్వల ద్వారా కాకుండా రాష్ట్రంలోనే తొలిసారిగా 20, 21, 21ఏ, 22.. ప్యాకేజీల కింద పైప్ లైన్ ద్వారా సాగు నీరు అందించేలా నిర్మాణం చేపడుతున్నారు. మంచిప్ప పెద్ద చెరువు, కొండెం చెరువులను కలిపి 3.5 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్ గా మార్చుతున్నారు. మంచిప్ప వద్ద ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

21వ ప్యాకేజీ పూర్తి చేసి.. ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, నియోజకవర్గాలకు ఎస్సారెస్పీ నీటిని అందించేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. మంచిప్ప చెరువు రిజర్వాయర్ మార్పు పై రగడ మొదలైంది. రిజర్వాయర్ పనులను రైతులు పలు మార్లు అడ్డుకోగా.. ఇప్పుడు మరోసారి ఉద్యమానికి రెడీ అవుతున్నారు. 1.5 టీఎంసీల నీరు నిల్వచేసేలా రిజర్వాయర్ నిర్మిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు 3.5 టీఎంసీల నీటి నిల్వ చేసేలా ప్రతిపాదన చేయడం పట్ల రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సేవ్ మంచిప్ప పేరుతో దశల వారి ఉద్యమం చేయాలని ముంపు బాధితుల కమిటీని తీర్మాణం చేసింది.

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనుల్లో భాగంగా.. మంచిప్ప రిజర్వాయర్ ను 1.5 టీఎంసీల నీటి సామర్ధ్యం కోసం తొలి విడతలో భూ సేకరణ చేపట్టారు అధికారులు. ఇందుకోసం సుమారు 150 ఎకరాల భూమిని రైతుల వద్ద నుండీ సేకరించారు. ఎకరాకు 5 లక్షల వరకు పరిహారం చెల్లించారు. గత సంవత్సరం రిజర్వాయర్ సామర్థ్యం 3.5 టిఎంసిలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీస్కుంది. ఇందుకోసం మరింత భూసెకరణ చేపట్టింది. ప్రస్తుతం మంచిప్పలో ఎకరం 60లక్షల నుంచి కోటి వరకు ధర పలుకుతోంది.

కానీ ప్రభుత్వం పరిహారం ఎంత ఇస్తుందో ప్రకటించడం లేదు. మంచిప్ప రిజర్వాయర్ 3.5 టీఎంసీల అప్ గ్రేడేషన్ కోసం అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాల నుంచి 1336 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉంది. మరో 788 ఎకరాల అటవీ భూమి కోసం ఆ శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. భూసేకరణకు వెళ్లిన అధికారులను రైతులు పలు మార్లు వెనక్కి పంపారు. మంచిప్ప రిజర్వాయర్ నిర్మానంలో భాగంగా 2 వేల ఎకరాల భూసెకరణ చేస్తున్నారు అధికారులు. ముంపు గ్రామాల రైతులంతా చిన్న, మద్యతరగతి రైతులే కావటంతో రైతులంతా భూములు కోల్పోతున్నారు.

మంచిప్ప రిజర్వాయర్ నీటి నిల్వ సామర్ధ్యం పెంపుతో అమ్రాబాద్, బైరాపూర్, మంచిప్ప గ్రామాలు నీట మునుగనున్నాయి. వీటితో పాటు మరో 8 తండాలు కనుమరుగు కానుండాటాంతో గత సంవత్సర కాలంగా రైతులు, ఆయా గ్రామాల ప్రజలు అందోలన చేస్తున్నారు.. పచ్చని పొలాలు, ఇళ్లు , కుటుంబాలు పుట్టకొకరు, గుట్టకొకరు కానున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిప్ప- కొండెం చెరువులను రిజర్వాయర్ గా మార్చేందుకు ఈ పాటికే సేకరించిన వందల ఎకరాలతో.. చాలా మంది రైతులు రోడ్డున పడ్డారు. భూములు కోల్పోయి కూలీలుగా మిగిలిపోయారు. గతంలో ఎకరానికి ఐదు లక్షల పరిహారం ఇచ్చి తమ భూములు లాక్కున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్నలు కూలీలుగా మారే దుస్దితి ఎందుకొచ్చిందని ప్రశ్నిస్తున్నారు. రీడిజైనింగ్ కేవలం కాంట్రాక్టర్ల, అధికార పార్టి నేతల కోసమేనని, రీ డీజైనింగ్ వల్ల రైతులకు ఉపయోగం లేదని, ఆయకట్టూ కూడా పెరగదని అంటూన్నారు ముంపు గ్రామాల రైతులు. మంచిప్ప రిజర్వాయర్ నీటి సామర్ధ్యం 1.5 టీఎంసీల నిల్వ కోసం తాము అంగీకరిస్తామని 3.5 టీఎంసీల సామర్ధ్యం కోసం పనులు చేస్తే అడ్డుకుంటామని ముంపు బాధితులు స్పష్టం చేస్తున్నారు. న్యాయ పోరాటంతో పాటు దశల వారిగా ఉద్యమ కార్యచరణకు రెడీ అవుతున్నారు. రైతుల పోరాటం ఎటువైపుకు దారితీస్తుందో.. రైతుల ఆందోళన పై సర్కారు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Next Story

Most Viewed