కలెక్టరేట్ ను ముట్టడించిన రామన్నపేట గ్రామస్థులు

by Disha Web Desk 1 |
కలెక్టరేట్ ను ముట్టడించిన రామన్నపేట గ్రామస్థులు
X

దిశ, నిజామాబాద్ సిటీ : రామన్నపేట గ్రామస్థులు జిల్లా కలెక్టరేట్ ను ముట్టించారు. ర్యాలీగా తరలిరావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని కలెక్టరేట్ వద్ద గ్రామస్థులు మహిళలు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేయడానికి వెళ్లారు.

ఈ సందర్బంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలోని సర్వే నెం.350ల 5.30 ఎకరాల భూమికి సంబంధించి తమకు న్యాయం చేయాలని, ముదిరాజ్ సంఘం చెందిన సభ్యులు భూమిని కబ్జా చేసి అందులో ఉన్న దేవతా విగ్రహాలను బయట పారవేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమిలో గల ఆలయాల్లో పూజలు చేయనివ్వకుండా.. అక్కడికి ఎవ్వరిని రానివ్వకుండా గ్రామస్థులను అడ్డుకుంటున్నారని తెలిపారు.

సదరు భూమి గురించి ముదిరాజ్ సంఘ సభ్యులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే కేసు కోర్టులో ఉందని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. అదేవిధంగా అక్కడికి ఎవ్వరిని రానివ్వమంటూ భీష్మించుకొని కూర్చోవటమే కాకుండా దేవాలయాల్లోకి గ్రామస్థులను వెళ్లనివ్వకుండా అడ్డంగా గోడ నిర్మించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడి నుంచి కదలేది లేదని కలెక్టరేట్ ఎదుటే బైఠాయించారు.

కలెక్టరేట్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి 5.30 ఎకరాల భూమిపై సమగ్ర సర్వే జరిపి తమకు న్యాయం చేయాలని గ్రామస్థులు కోరారు. నిరసన కార్యక్రమంలో పర్స రత్నయ్య, సుంకరి సాయన్న, ప్రకాష్, పతాని అనసుయ, తెడ్డు మహిపాల్, తెడ్డు చిన్న భూమేశ్వర్, కొండపూర్ లక్ష్మి, కనకనడిపి గంగాధర్, కంతి మురళి, కనక మల్లయి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed