మార్కెట్ యార్డులో పసుపు రైతుల నిలువుదోపిడి..

by Disha Web Desk 20 |
మార్కెట్ యార్డులో పసుపు రైతుల నిలువుదోపిడి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో రైతులు నిలువుదోపిడికి గురవుతున్నారు. మొన్నటి వరకు ధరలు లేవని ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇటీవల కాలంలో ధర రూ.5 వేలు పై చిలుకు దాటిందని సంతోషపడుతుంటే అది కేవలం నోటీసుబోర్డులకే పరిమితమౌతుంది. నోటీసు బోర్డులో గరిష్ట, కనిష్ట ధరలలో రైతులు నిలువునా మోసపోతున్నారు. ఖరీదుదారులు, కమీషన్ ఏజంట్లు కూడబలుకుని తమకు నచ్చిన ధరనే రైతులకు చెల్లిస్తున్నారు. తేమ శాతం తక్కువగా ఉందని చెబితే కాడి, గోలా రకాలకు వేర్వేరుగా ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఈనామ్ ద్వారా కొనుగోలు జరుగుతాయని, రైతులు మోసపోయే అవకాశం లేదని చెబుతుంటే వాస్తవానికి వచ్చేసరికి జరుగుతున్నది వేరేలా ఉంది.

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ప్రతియేడాది లక్షల క్వింటాళ్ల పసుపు వస్తుంది. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల నుంచి ప్రతియేటా వచ్చే పసుపు ద్వారా మార్కెట్ కమిటీకి ఆదాయం వస్తుంది. కానీ రైతులకు మద్దతు ధర అవకాశం లేకపోవడంతో రైతులు నిలువుదోపిడికి గురవుతున్నారు. సోమవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గరిష్ట పసుపు ధర రూ.7200 కాగా కనిష్టంగా రూ.4500గా కాడికి నిర్ణయించారు. గోలా రకానికి రూ.6119, కనిష్టంగా రూ.4050 ధరగా ఉంది. కానీ రైతులకు వచ్చేసరికి కనిష్టంలో కోత వెయ్యి వరకు వస్తుందని లబోదిబోమంటున్నారు. దుంపకుళ్ల తెగుళ్లతో పాటు ఇటీవల అకాల వర్షానికి చాలా ప్రాంతాల్లో పసుపు పచ్చిగా అయింది. దాంతో మార్కెట్ యార్డులో ఖరీదుదారులు, కమీషన్ ఏజంట్లు భారీగా రైతులను దండుకుంటున్నారు. గతేడాది మార్కెట్ లో ధరలేని సమయంలో క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి గిడ్డంగుల్లో, కోల్డ్ స్టోరేజిలో భద్రపర్చుకున్న వ్యాపారులు ఈసారి కూడా అదేసూత్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు లక్షక్వింటాళ్ల పసుపు మార్కెట్ వచ్చిందని అధికారులు చెబుతున్నారు.

మరో రెండు నెలల పాటు పసుపు రాక ఎక్కువగా ఉండనుంది. గరిష్ట ధర చూసి మార్కెట్ కు పసుపు తెచ్చిన రైతులను వ్యాపారులు మాయ చేస్తున్నారు. అధికారుల అలసత్వాన్ని అలుసుగా తీసుకుని క్వింటాళ్ల కొనుగోలు పై రూ.500 నుంచి రూ.1000 వరకు గండికొడుతున్నారు. అసలే మార్కెట్లో ధర లేదని లబోదిబోమంటున్న రైతులు అకాల వర్షంతో పాటు పసుపు నిల్వ చేసే స్థలం లేక ఏదోఒక ధరకు అమ్ముకోవాలసిన పరిస్థితి ఏర్పడింది. గతంలో మాదిరిగా ఇక్కడి పసుపును సాంగ్లీ తీసుకెళ్లలేని పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఈసారి పసుపు దిగుబడి ఎక్కువ కావడంతో అక్కడ డిమాండ్ తగ్గింది. దాంతో అక్కడ వచ్చే ధర రవాణా ఖర్చులకే సరిపోతుందని రైతులు తప్పని పరిస్థితుల్లో ఇక్కడ అమ్ముదామంటే ఖరీదుదారులు, కమిషన్ ఏజంట్ల కబందహస్తల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. మార్కెట్ కమిటీ అధికారులు ధరల గురించి చెబుతున్నారు కానీ అవి పక్కా అమలవుతున్నాయా ? రైతులకు వ్యాపారులు ఎంత చెల్లిస్తున్నారని పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. నోటీసు బోర్డులో పెట్టిన ధరకు రైతులకు ఇస్తున్న ధరలకు వ్యత్యాసం ఉందని రైతులు గగ్గోలు పెడుతున్నారు.



Next Story

Most Viewed