ఆగని కల్తీ కల్లు దందా.. తూతూ మంత్రంగా శాంపిళ్ల సేకరణ

by Sumithra |
ఆగని కల్తీ కల్లు దందా.. తూతూ మంత్రంగా శాంపిళ్ల సేకరణ
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా ఎక్సైజ్ శాఖ కల్తీ కల్లు ఘటనను తేలిగ్గా తీసుకుందా ?.. ఏముందిలే ఎప్పుడూ ఉండేదే అనే ధోరణితో వ్యవహరిస్తోందా?.. కొద్ది రోజులు పోయాక అదే సర్దుకుంటుందిలే అనే నిర్లక్ష్య భావంతో నిద్ర పోతుందా?.. అంతర్గతంగా కల్లు దుకాణాలు, కల్లు డిపోల నిర్వాహకులకు ఓరల్ గా వార్నింగులు ఇస్తూ అధికారిక చర్యలకు మంగళం పాడుతోందా ?... అంటే అవుననే సందేహాలే కలుగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు కల్లోలం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం కల్తీ కల్లు తాగి దాదాపు వంద మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. మరి కొందరు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య చికిత్సలతో ప్రాణాపాయం తప్పి బయటపడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అడిషనల్ కలెక్టర్‌‌, డీఎం అండ్ హెచ్ఓ, ఎక్సైజ్, పోలీస్ అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టి బాధితులందరినీ ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితిని సమీక్షించారు. ఇంత జరగినా కనీసం ఈ సంఘటన అనంతరం కల్తీకల్లు వ్యవహారం పై ఎక్సైజ్ శాఖ రియాక్షన్ ఊహించిన స్థాయిలో లేకపోవడం పై సర్వత్రా విమర్శలు చోటు చేసుకున్నాయి.

ఎక్సైజ్ అధికారులు మాత్రం జిల్లాలోని అన్ని కల్లు డిపోలు, టీఎఫ్ టీలలో శాంపిల్స్ సేకరిస్తున్నామని చెపుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆస్థాయిలో హడావిడి కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు జాఢ్యం విపరీతంగా పెరిగిపోయిందన్న సంగతి జగమెరిగిన సత్యం. అయినా ఎక్సైజ్ శాఖ మాత్రం ఏమీ ఎరగనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో కల్తీ కల్లు ఇంత కల్లోలం రేపుతున్నా, జిల్లాలో తరచూ ఆకస్మిక తనిఖీలు చేపట్టకపోవడం, నమూనాలు సేకరించక పోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. తరచుగా తాము శాంపిళ్లు సేకరిస్తామని చెపుతున్న అధికారులు, మరి ఎన్ని షాపులపై కేసులు పెట్టారో బయటపెట్టరు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ లోని దుర్కి, దామరంచ, ఆంకోల్, గాంధారి లలో వరుసగా రెండు రోజుల పాటు కల్తీ కల్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన దాదాపు వంద మంది బాధితులు వింత ప్రవర్తన, లక్షణాలతో ఆస్పత్రుల పాలయ్యారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్, కామారెడ్డి జీజీహెచ్లకు తరలించి ప్రత్యేక వైద్యం అందించి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు.

వ్యాపారంలో పోటీని తట్టుకునేందుకేనా ?

కల్లు వ్యాపారంలో పోటీని తట్టుకునేందుకు, కల్లుప్రియులను ఎక్కువ సంఖ్యలో ఆకర్షించేందుకు కల్లులో కల్తీ మోతాదును పెంచుతున్నట్లు తెలుస్తోంది. కల్లు ప్రియుల్లో ఎక్కువ శాతం కష్టజీవులే ఉంటారు. పొద్దంతా కాయకష్టం చేసి వారి కష్టాన్ని, ఒళ్లు నొప్పులను మర్చిపోవడానికి బడుగు జీవులు వారి రోజూ వారీ బడ్జెట్‌లో అందుబాటులో దొరికే కల్లు తాగేందుకు ఇష్టపడుతారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మత్తును పొందాలనుకుంటారు కల్లు ప్రియులు. చాలా చోట్ల ఎన్నిసీసాల కల్లు తాగినా మత్తు ఎక్కట్లేదని, మందు తక్కువ కలుపుతున్నావంటూ దుకాణాదారులతో మందుబాబులు గొడవలు పెట్టుకునే సందర్భాలు అనేకంగా ఉంటాయి. కల్లు ప్రియులు మత్తును ఎక్కువగా కోరుకుంటున్నారనే విషయం గమనిస్తున్న కొందరు కల్లు దుకాణాదారులు నిర్ణీత మోతాదును మించి మత్తు పదార్థం కలుపుతున్నారు. డైజోఫాం కలిపే విషయంలో అనుభవం కలిగిన వారే జాగ్రత్తగా ప్రమాదసూచిక దాటకుండా కలుపుతారని, అనుభవం లేని వారో లేదంటే పరధ్యానంగానో కలిపిన సందర్భాల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని కల్లు దుకాణ వ్యాపారులు చెపుతున్నారు.

పక్కాగా తనిఖీలు చేస్తే సగానికి పైగా మూసుకోవాల్సిందే..

అధికారులు స్పెషల్ డ్రైవ్ పక్కాగా నిర్వహిస్తే సగానికి పైగా షాపులు మూతపడతాయని, ఎవరూ కూడా కల్లును కల్తీ చేయకుండా అమ్మకాలు జరగవని కల్లు వ్యాపారులు ధైర్యంగా చెపుతున్నారు. ఎన్ని స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించినా, కల్తీ జరిందని ల్యాబ్ టెస్టులో తేలినా జరిగే నష్టం ఏంలేదని వారు నిర్భీతిగా మాట్లాడుతున్నారు. క్రమం తప్పకుండా ముడుపులు తీసుకునే అధికారులు మాకు తనిఖీల సమాచారం ఇవ్వకుండా ఎప్పుడూ రారని, వచ్చినా మా దగ్గర వారికేం దొరకదని చెపుతున్నారు. ఓ పక్క కల్తీ కల్లు అమ్ముతున్నా, మేము శాంపిల్ కోసం పక్కకు తీసి ఉంచిన కల్లునే వారు టెస్టుల కోసం తీసుకెళతారని చెపుతున్నారు. ఎవరినో ఒకరిని బలిపశువును చేయాలనుకుంటే మాత్రం ముడుపులు సరిగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసే వారిపైనే కేసులు నమోదు చేస్తారని ఓ వ్యాపారి చెప్పడం గమనార్హం

జిల్లా ఇంచార్జి మంత్రి పరిధిలోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ..

జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు పరిధిలోనే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉంది. కొద్ది రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలో జరిగిన కల్తీ కల్లు ఘటన పై మంత్రి ఒక్క ప్రకటన కూడా ఇప్పటివరకు చేయలేదు. మంగళవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి జూపల్లి టూర్ షెడ్యూల్ లో ఎక్సైజ్ శాఖతో సమావేశం కూడా లేదు. అంటే కామారెడ్డి జిల్లాలో జరిగిన కల్తీ కల్లు ఘటనను ఎక్సైజ్ శాఖతో పాటు ఎక్సైజ్ మంత్రి కూడా తేలిగ్గానే తీసుకున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రొటీన్ తనిఖీలు జరుగుతూనే ఉంటాయి.. సోమిరెడ్డి, జిల్లా ఎక్సైజ్ అధికారి

జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు డిపోలు, దుకాణాల్లో ప్రతినెలా రెగ్యులర్ గా తనిఖీలు చేపడుతుంటాం. అన్ని స్టేషన్ పరిధిలను కలుపుకుని ప్రతినెలా 20 నుంచి 25 వరకు శాంపిల్స్ సేకరిస్తాము. వాటిని ల్యాబ్ కు పంపి రిపోర్టు ఆధారంగా చర్యలు కూడా తీసుకుంటున్నాము. దుర్కి, ఆంకోల్, దామరంచ, గాంధారిలలో జరిగిన ఘటనలో కూడా శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపగా ఆల్ఫ్రాజోలం కలిపినట్లుగా రిపోర్టు వచ్చింది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశాం. అసలు మద్దాయి తప్పించుకున్నాడు. ఆ ముద్దాయి పట్టుబడితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎక్సైజ్ శాఖ పై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. మా పరిధిలో మేం కల్తీ కల్లు నివారణ కోసం నిజాయితీగా పనిచేస్తున్నాం.



Next Story

Most Viewed