ఆగని ఫార్మా కంపెనీ లొల్లి.. న్యాయం జరిగే వరకూ పోరు

by Disha Web Desk 6 |
ఆగని ఫార్మా కంపెనీ లొల్లి.. న్యాయం జరిగే వరకూ పోరు
X

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భిక్కనూరు (మండలం) కాచాపూర్ ఊరు ఊరంతా ఒక్కటైంది. ఆ ఫార్మా కంపెనీ మాకొద్దంటూ గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి వ్యతిరేకిస్తున్నారు. 31 రోజులుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ధర్నా, రాస్తారోకోలతో ఫ్యాక్టరీ వెదజల్లుతున్న కాలుష్య భూతా న్ని వ్యతిరేకిస్తున్నారు. ఫార్మా కంపెనీ నిలిపివేయాలని లేకుంటే.. ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

దిశ, భిక్కనూరు : చెరువులోకి వెళ్లి స్నానం చేయాలంటే భయం, బోరు బావిలో నుంచి వచ్చే నీళ్లను తాగడం మానేసి చాలా రోజులైంది ఆ గ్రామస్తులకు, రైతులకు. ఫ్యాక్టరీ వెదజల్లే విషవాయువు.. కాలుష్య కోరల్లో చిక్కుకొని అయోమయానికి గురవుతున్న ఆ గ్రామస్తులంతా ఒక్కటై ఫార్మా కంపెనీ మూసివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 31 వ రోజుకు చేరుకున్నాయి. గ్రామ శివారులో ఉన్న ఎం ఎస్ ఎన్ ఫార్మా కంపెనీ వలన లక్షల రూపాయల విలువ చేసే చేపలు మృతి చెందడం, గొర్రెలు మృత్యువాత పడడం, చెరువు నీళ్ళు పూర్తిగా రంగు మాయం కావడం, అనారోగ్య సమస్యలు క్రమంగా తలెత్తడం వలన గ్రామస్తులంతా ఒక్కటై ముక్తకంఠంతో ఫార్మా కంపెనీ మూసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టారు.

నిరసన దీక్షను భగ్నం చేయడానికి టెంట్లు తొలగించి, పోలీసులతో ఒత్తిడి చూపించినప్పటికీ గ్రామస్తులు మాత్రం ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా దీక్షలను కుల సంఘాల వారిగా మరింత ఉధృతం చేశారు. ఒకరోజు వంట వార్పుతో దీక్షను ఉధృతం చేయాలని చూశారు. గ్రామస్తులు చేపట్టిన దీక్షకు అధికార పార్టీ మినహా ఆయా పార్టీల నాయకులు వచ్చి దీక్ష కు మద్దతు ప్రకటించారు. ఫార్మా కంపెనీ రూ.15 లక్షలు వెచ్చించి ఇచ్చిన హైమాస్ లైట్లను వద్దని, సచివాలయం ముందు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ప్రతి ఒక్కరూ ఫార్మా కంపెనీ ఇచ్చే తాయిలాల కు ఆశపడి ఊరుకుంటే, గ్రామం వల్లకాడుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో సమావేశంలో మెజార్టీ గ్రామస్తులు ఫార్మా కంపెనీ ఇచ్చే లైట్లు వద్దే వద్దని చెప్పగా, కొందరు మాత్రమే వారిచ్చే లైట్లు తీసుకుని అభివృద్ధి చేయడంతో పాటు, ఫార్మా కంపెనీ తో ఫైట్ చేయడం చేయడమే అంటూ అభిప్రాయం వ్యక్తం చేయడంతో సమావేశం వాద ప్రతి వాదనలతో అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినప్పటికీ గ్రామస్తులు మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి దీక్షను మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఫార్మా కంపెనీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదికలను తీసుకెళ్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు క్షుణ్ణంగా పరిస్థితిని వివరించారు. పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫార్మా కంపెనీ పై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ వలన గ్రామానికి జరుగుతున్న నష్టాన్ని నివారించి, తమకు న్యాయం జరిగే వరకు తమ నిరసన దీక్ష కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు.


Next Story

Most Viewed