రూ.80 వేలకు బాలికను కొనుగోలు చేసి నిత్యం అత్యాచారం...

by Sridhar Babu |
రూ.80 వేలకు బాలికను కొనుగోలు చేసి నిత్యం అత్యాచారం...
X

దిశ,కామారెడ్డి : రూ.80 వేలకు బాలికను కొనుగోలు చేసి నిత్యం అత్యాచారం చేస్తూ బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల వెనక్కి వెళ్లిన ఉదంతం మంగళవారం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. మండలానికి చెందిన ఓ వ్యక్తి మొదటి భార్యకు ఇద్దరు కూతుర్లు (కవలలు) ఉన్నారు. అనంతరం ఆమె చనిపోవడంతో రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య చెప్పుడు మాటలు విని మొదటి భార్యకు చెందిన ఇద్దరు కవలల్లో ఒక బాలిక (14) ను మార్వాడీకి రూ.80 వేలకు విక్రయించారు. అయితే సదరు వ్యక్తి అమ్మాయిని తీసుకొని హైదరాబాద్​లోని ఓ ప్రాంతంలో ఉంచి తరచూ శారీరకంగా అనుభవించడంతోపాటు ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దాంతో ఆమె తప్పించుకొని వచ్చి జిల్లా బాలల సంరక్షణ అధికారి స్రవంతిని ఆశ్రయించింది. గతంలో తన అక్కను కూడా ఇలాగే విక్రయించారని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కేసు నమోదు చేసి డీఎస్పీ సోమనాథం ఆధ్వర్యంలో విచారణ చేపట్టి మార్వాడీతో పాటు విక్రయించిన భార్య భర్తలు, వారికి సహకరించిన మధ్యవర్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాలలను అపహరించడం, వారిని లైంగికంగా వేధించడం లాంటి హేయమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసులో చాక చక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ శ్రీనివాస్, మాచరెడ్డి ఎస్ఐ సంతోష్ లను అభినందించారు.

Next Story