వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శం : మంత్రి హరీష్ రావు

by Disha Web Desk 1 |
వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికి ఆదర్శం : మంత్రి హరీష్ రావు
X

దిశ, ఎల్లారెడ్డి (నాగిరెడ్డిపేట్) : వైద్య, ఆరోగ్య రంగంలో నిరుపేదలకు మెరుగైన సేవలందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించబోయే వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక వైద్యం మొదలుకుని సూపర్ స్పెషాలిటీ సేవల వరకు తెలంగాణలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదన్నారు. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాసు, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వందకు 63 శాతం డెలివరీలు ప్రభుత్వాసుపత్రిలోనే జరుగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ కిట్ తో పాటు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందజేస్తున్నామని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మెడిసన్ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల్లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలోనే చదువుకోవాలన్నారు.

ఇప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజ్ ప్రారంభం కాబోతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొస్తున్నామని తెలిపారు. ఎల్లారెడ్డిలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రి భవనం నిర్మించి ప్రారంభిస్తామని పేర్కొ్న్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed