ఆ క్వారీ మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశాలు..

by Sumithra |
ఆ క్వారీ మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని బట్టాపూర్ లోని కంకర క్వారీని మూసివేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాల్కొండ నియోజకవర్గంలోని బట్టాపూర్ క్వారీ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని దాన్ని ఎన్ జీటీ అనుమతులు లేవని, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేవని, ప్రభుత్వానికి చెల్లించే రాయాల్టీ ఎగవేస్తున్నారని, క్వారీకి సంబంధించిన విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని బీజేపీ ఆధ్వర్యంలో గత కొంత కాలంగా నిరసనలు చేపట్టిన విషయం తెల్సిందే. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న డెవలప్ మెంట్ పనులన్నింటిని బట్టాపూర్ కంకర క్వారీ ద్వారానే ముడిసరుకు సరఫరా జరుగుతుందని బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి ఏలేటి మల్లిఖార్జున్ రెడ్డి ప్రభుత్వానికి, అటవి శాఖకు, కాలుష్య నియంత్రణ మండలికి, జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, తెలంగాణ హై కోర్టు లో "ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్)" దాఖలు చేశారు. ఇటీవల హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. పిటిషన్ తరపు న్యాయవాది క్వారీలో అక్రమాలు జరుగుతున్నది వాస్తవం అని, పర్యావరణ అనుమతులు లేకుండా, ప్రజలకు హానికలిగిస్తూ, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న బట్టాపూర్ క్వారీని తక్షణమే మూసివేయాలని హై కోర్టును అభ్యర్థించారు. కోర్టు సాక్ష్యాలను అనుమతులు లేని విషయాన్ని రికార్డుల ద్వారా పరిశీలించి బట్టాపూర్ క్వారీ మూసివేత ప్రక్రియ ప్రారంభించాలని కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం మంత్రి ప్రశాంత్ రెడ్డి బంధువులు నిర్వహిస్తున్న క్వారీలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, అన్ని అనుమతులు ఉన్నాయని మీడియా ముందర సవాల్ చేసిన వారం రోజుల్లోనే కోర్టులో క్వారీ నిర్వాహకులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

బట్టాపూర్ కంకర క్వారీ మూసివేతకు హైకోర్టు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇవ్వడంతో గురువారం బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, అన్ని మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, బీజేవైఎం నాయకులు, అన్ని మోర్చాల నాయకుల ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. స్థానికంగా బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి మల్లిఖార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో క్వారీ వద్ద రైతులతో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బట్టాపూర్ క్వారీలో అక్రమాలు జరుగకపోతే నిబంధనలను ఉల్లంగించకపోతే న్యాయస్థానం ఎందుకు దాని మూసివేతకు ఆదేశాలిస్తుందని మండిపడ్డారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి అండ చూసుకుని ఆయన బంధువులు పది సంవత్సరాలుగా క్వారీని ఇల్లిగల్ గా నిర్వహించడంలో జరిగిన అక్రమాలు రుజువయ్యాయన్నారు. అక్రమ క్వారీ గురించి నిరంతరం పోరాటం చేస్తూ క్వారీలో జరుగుతున్న అక్రమాలపై ఉక్కుపాదం మోపి సమాచార హక్కు చట్టం ద్వారా బట్టాపూర్ క్వారీలో జరుగుతున్న అక్రమాల వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో బయటపెడుతూ, ఉన్నతాధికారులకు ఫిర్యాధులు చేసిన బిజెపి ఆధ్వర్యంలో అక్రమ క్వారీ మూసివేతతో బట్టాపూర్ ,పరిసర ప్రాంత రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో దొరల పాలన నడుస్తుందని, అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తూ కమిషన్లు తీసుకుంటు అక్రమాలకు పాల్పడుతున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి రాబోయే ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో బిజెపి జెండా ఎగరడం కాయమని, ఇన్ని అక్రమాలు చేస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి కి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Next Story

Most Viewed