న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు.. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్

by Disha Web Desk 20 |
న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు.. రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ అన్నారు. ప్రజల న్యాయ సంబంధిత సమస్యల పరిష్కారంలో న్యాయ వ్యవస్థ అగ్రభాగాన ఉందని వెల్లడించారు. రోటరీ క్లబ్ సహకారంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 263 మందికి కృతిమ కాళ్ళను ఉచితంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ ముఖ్య అతిథిగా, హైకోర్టు న్యాయమూర్తులు పీ.నవీన్ రావు, పీ.శ్రీసుధా హాజరయ్యారు. ఆదివారం ఉదయం ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కు జిల్లా జడ్జి కె.సునీత, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు బొకేలు అందించి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుండి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సందర్శించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చిందు కళాకారులు తమ సాంప్రదాయ కళా ప్రదర్శనతో స్వాగతం పలికారు. చిన్నారులు దేశభక్తి గేయంపై చక్కని నృత్య ప్రదర్శనతో కార్యక్రమానికి వన్నెలద్దారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకల్యంతో బాధుపడుతున్న వారికి కృత్రిమ అవయవాలు ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని అన్నారు.

ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందన్నారు. ఇదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ తరహా సేవా కార్యక్రమాలు కొనసాగించాలని అభిలషించారు. సమాజంలోని ఆయా వర్గాల వారి అవసరాలను గుర్తిస్తూ సేవలందించడం వల్ల గొప్ప సంతృప్తి లభిస్తుందన్నారు. కాగా, ప్రభుత్వ వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలను కలుపుకుని సామాజిక మార్పుకోసం, అన్నివర్గాల అభ్యున్నతే ధ్యేయంగా న్యాయవ్యవస్థ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నదని అన్నారు. ఉచిత న్యాయసేవలు పొందడం పౌరుల ప్రాథమిక హక్కు అని, దానిని ఎల్లవేళల అందిస్తామని పేర్కొన్నారు. అవసరమైన అందరికి న్యాయసేవలు అందించాలనే సుప్రీంకోర్టు డెబ్భై ఏళ్ల క్రితమే తన తీర్పులో వ్యక్తికరించిందని, దానిని చట్టం రూపంలో అమలు చేసుకుంటున్నామని గుర్తు చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ జైలు ఖైదీ రాసిన ఒక ఉత్తరమే ప్రామాణికంగా తీసుకుని ఆ సమస్యకు అంతిమ పరిష్కారం కనుగొని పరిష్కరించారని ఈ సందర్భంగా ఉటంకించారు. సత్వర న్యాయసేవలలో భాగంగా జాతీయ లోక్ అదాలత్ ద్వారా వేలాది న్యాయ సంబంధిత వివాదాలను రాజీ పద్దతిన పరిష్కరించి, రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా కార్యాచరణ కొనసాగుతుందని హైకోర్టు చీఫ్ జస్టిస్ భుయాన్ తెలిపారు. రోటరీ క్లబ్ లాంటి సామాజిక దృక్పథం గల వారి సహకారంతో దివ్యాంగులైన వందల మందికి ఉచిత కృత్రిమ అవయవాలను అందజేయడం న్యాయవ్యవస్థ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

అనంతరం హైకోర్టు న్యాయమూర్తి పీ.నవీన్ రావు మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను సామాన్యులు సైతం సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు మరింత విస్తృత స్థాయిలో కృషి చేయాలన్నారు. సరిపడా సంఖ్యలో న్యాయమూర్తులు, సిబ్బంది లేకపోవడం, విభజన ప్రక్రియ వల్ల ఏర్పడిన ఇబ్బందులు, కోవిడ్ సంక్షోభం వంటి కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టులలో 8 లక్షల కేసులు అపరిష్కృతంగా ఉండగా, ఒక్క హైకోర్టు పరిధిలోనే రెండున్నర లక్షల కేసులు పరిష్కారం కావాల్సి ఉన్నాయని వివరించారు.

ఇరువర్గాలు రాజీ మార్గంలో లోక్ అదాలత్ ల ద్వారా న్యాయ వివాదాల పరిష్కారానికి ముందుకు వస్తే అనేక పెండింగ్ కేసులు సత్వర పరిష్కారానికి నోచుకునే అవకాశం ఉంటుందన్నారు. దీనివల్ల ఇరువర్గాల వారికి కూడా రెండు రకాల ప్రయోజనం చేకూరుతుందని, సత్వర న్యాయంతో పాటు రాజీ మార్గంలో పరిష్కరించుకున్నందున వివాదానికి శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుందని అన్నారు. లోక్ అదాలత్ ల ద్వారా పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోదల్చినవారు న్యాయ సేవాధికార సంస్థ సేవలు పొందవచ్చని సూచించారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కూడా న్యాయ సేవా సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు.

గృహహింస బాధితులకు, అఘాయిత్యాలకు గురైన చిన్నారులు, నిరాదరణకు లోనయ్యే వృద్దులు, సైబర్ క్రైం బాధితులకు కూడా లీగల్ సర్వీసెస్ సంస్థ ద్వారా సేవలందించవచ్చని అన్నారు. అర్హులైన వారంతా సంస్థ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో అవగాహన పెంపొందిస్తూ, విస్తృత ప్రచారం నిర్వహించాలని జస్టిస్ పీ.నవీన్ రావు పిలుపునిచ్చారు.

హైకోర్టు న్యాయమూర్తి పీ.శ్రీసుధ మాట్లాడుతూ, తన తొలి పోస్టింగ్ నిజామాబాద్ లోనే కొనసాగినందున ఈ జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందన్నారు. రోటరీ క్లబ్ అంతర్జాతీయ స్థాయిలో వివిధ వర్గాల వారి కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే - మాధవ సేవ అని ఆచరణాత్మకంగా నిరూపిస్తున్నారని ప్రశంసించారు. జిల్లాలో ఎక్కువగా అదనపు కట్నం కోసం హత్యలు చేస్తున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయని ఒకింత ఆందోళన వెలిబుచ్చారు. నేటి సమాజంలో మనమంతా మానవులం అనే విషయాన్ని మర్చిపోయి, మరమనుషులుగా జీవనాలు వెళ్లదీస్తుండడం అనేక అనర్థాలకు దారి తీస్తోందని అభిప్రాయపడ్డారు.

సనాతన భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలను ఆచరిస్తూ, దంపతులు పరస్పరం గౌరవభావంతో మెలిగితే సమస్యలకు ఆస్కారమే ఉండదని హితవు పలికారు. ఇంటిల్లిపాది అవసరాలను చక్కబెట్టే గృహిణుల పట్ల చులకన భావం ప్రదర్శించకుండా ఇంటిపనుల్లో పురుషులు తోడ్పాటును అందిస్తే కుటుంబ కలహాలకు తావులేకుండా దంపతుల మధ్య ప్రేమాప్యాయతలు పెరుగుతాయని హితవు పలికారు. పిల్లలకు మంచి విలువలను, వారి బాధ్యతల గురించి నేర్పుతూ, సమాజంలో చోటుచేసుకునే అఘాయిత్యాలు, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని, వారికి ఏదైనా జరిగితే నిర్భయంగా తెలిపేలా స్వేచ్ఛను కల్పించాలని అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేసిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి జిల్లా జడ్జి కె.సునీత హైకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తెచ్చారు. లీగల్ సర్వీసెస్ సంస్థతో కలిసి జిల్లా యంత్రాంగం ఆయా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నూతనంగా ప్రారంభమైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు హాజరు కావడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో బాధితులకు మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను సీ.జే చేతుల మీదుగా అందించారు. బేటీ బచావో - బేటీ పడావో కార్యక్రమం కింద పలువురు బాలికలకు సైకిళ్ళు, వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను తెలియజేసేలా ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రధాన న్యాయమూర్తి సందర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా జడ్జీలు, న్యాయశాఖ అధికారులు, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు ఎం.రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం గణపతి రోటరీ క్లబ్ అధ్యక్షుడు సతీష్ షా, న్యాయ సేవాధికార సంస్థ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed