కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

by Disha Web Desk 19 |
కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
X

దిశ, కామారెడ్డి రూరల్: ఒకవైపు జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా వజ్రోత్సవ వేడుకలు జరుగుతున్న సమయంలో జిల్లా కేంద్రానికి సమీపంలో పాత కలెక్టరేట్ సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడి భారీ ప్రమాదం చోటుచేసుకుంది. కామారెడ్డి పాత కలెక్టరేట్ వద్ద బాన్సువాడ నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. బస్సు ఒకవైపు మాత్రమే బోల్తాపడి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదస్థలి వద్ద చూసిన ప్రకారం బస్సు మరొక పల్టీ కొట్టి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో కామారెడ్డి ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

బాన్సువాడ నుంచి కామారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు పాత కలెక్టర్ కార్యాలయం వద్దకు రాగానే బస్సు డ్రైవర్ బాపురావుకు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టు కావడంతో బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో పాటు డివైడర్ పై నుంచి కొద్దిదూరం వెళ్లి బోల్తాపడింది. బస్సులో 29 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 25 మందికి స్వల్ప గాయాలు కాగా మరో ముగ్గురికి తీవ్ర గాయలైనట్టు స్థానికులు తెలిపారు. అయితే గత రెండు మూడు రోజులుగా బస్సు డ్రైవర్ జ్వరంతో బాధపడుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను పక్కనే ఉన్న ఎఫ్సీఐ గోదాం కార్మికుల సహాయంతో జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపారు.

మంత్రి కనీసం ఆగరా..?

ప్రమాదం జరిగిన సుమారు అరగంట తర్వాత జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి తన కాన్వాయిలో ప్రమాద స్థలి నుంచే బయలుదేరారు. అయితే మంత్రి కాన్వాయి అక్కడ ఆగకపోవడంతో అక్కడున్న స్థానికులను కనీసం ఏం జరిగిందో తెలుసుకోవడానికైనా మంత్రి క్షణం కూడా ఆగరా అని మాట్లాడుకోవడం కనిపించింది.


Next Story