'ప్రభుత్వం నుండి నిధులు వచ్చుడో.. నా ప్రాణం పోవుడో'

by Disha Web Desk 20 |
ప్రభుత్వం నుండి నిధులు వచ్చుడో..  నా ప్రాణం పోవుడో
X

దిశ, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న శ్రీనిధి అభయహస్తం వడ్డీ లేని రుణాలు వెంటనే విడుదల చేయాలని డ్వాక్రా సంఘం మహిళలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కామారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘం మహిళలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకేంద్రంలో వేలాది మంది డ్వాక్రా సంఘాల మహిళలు గాంధీగంజ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చారు. కామారెడ్డిలో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా మారకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి నియోజకవర్గంలో 7000లకు పైగా మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. మహిళలకు ప్రభుత్వం నుంచి 52 కోట్ల రూపాయల వరకు శ్రీనిధి అభయహస్తం వడ్డీ లేని రుణాలు రావాల్సి ఉందన్నారు.

మహిళలకు రుణాలు ఇస్తూ వడ్డీ తిరిగి చెల్లించకుండా ప్రభుత్వం మొహం చాటేస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 120 కోట్లు రావాలని కామారెడ్డిలో ప్రారంభమైన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ఉదృతం కాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళల రుణాల విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు మున్సిపల్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తానని అప్పటికి స్పందించకపోతే శుక్రవారం నుండి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు. ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదా నా ప్రాణం పోయినప్పటికీ ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.


Next Story

Most Viewed