అధికారుల్లో తగ్గని నిర్లక్ష్యం.. రూ.లక్షలు దుర్వినియోగం

by Web Desk |
అధికారుల్లో తగ్గని నిర్లక్ష్యం.. రూ.లక్షలు దుర్వినియోగం
X

దిశ, కోటగిరి: హరితహారం కార్యక్రమంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా కోటగిరి మండలంలో ఇప్పటి వరకు నాటిన మొక్కల జాబితా ఆఫీసర్ల రికార్డుల్లో లక్షలు దాటినా వాటిలో బతికిన మొక్కలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ప్రతి జీపీకి ఒక ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్‌‌ తీసుకున్న తర్వాత మొక్కల సంరక్షణ మరింతగా పెరిగిందని చెప్పవచ్చు. హరిత హారంలో పెట్టిన మొక్కలకు పశువుల నుండి రక్షణ కల్పించేందుకు ఒక్కో మొక్కకు దాదాపు 150 రూపాయల చొప్పున ప్రతి జీపీ నుండి లక్షల రూపాయలు ఖర్చుతో ప్రతి గ్రామంలో వేలల్లో ట్రీ-గార్డులు ఏర్పాటు చేశారు. వీటి విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం కనబరుస్తున్నారు.

నాటిన మొక్కలు పెద్దవైన ప్రదేశంలో ట్రీ-గార్డులు అవసరం లేకున్నా మొక్కకే ట్రీ-గార్డులు ఉంచుతున్నారు, మరికొన్ని ట్రీ-గార్డులు అస్తవ్యస్తంగా పడి ఉన్నా వాటిని సేకరించకపోవటం, ఆ ట్రీ-గార్డులను రీ-యూజ్ చేసే అవకాశం ఉన్నా వాటిని అక్కడే వదిలేయడం ఇటువంటి పనుల కారణంగా ప్రజాధనంపై ఆఫీసర్ల నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మండలంలో నిత్యం ఉన్నతాధికారులు తిరిగే ప్రధాన రహదారుల పక్కనే అస్తవ్యస్తంగా పడిఉన్న ట్రీ-గార్డులను సరిచేయించటంలో అధికారులు విఫలమౌతున్నారంటే గ్రామీణ స్థాయిలో పనితీరు ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ట్రీ-గార్డులు అవసరం లేని చోట తీసేసి కొత్తగా నాటే మొక్కలకు అమరిస్తే వచ్చే సీజన్‌లో కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు.

కానీ ఆఫీసర్లు, సర్పంచ్‌లు మాత్రం మరిన్ని ట్రీ-గార్డులు కొంటే వచ్చే కమీషన్ కోసం లాలూచీ పడి లక్షల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. వర్షాకాలంలో రాబోయే 8వ విడత హరిత హారంలో భాగంగా ఒక్కో జీపీకి 16 వేల మొక్కలు నాటి సంరక్షించాలనే లక్ష్యమున్నా ఆఫీసర్లు, సర్పంచ్‌లు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో ప్రజాధనం వృథా అవుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా గ్రామాల్లో, రోడ్ల పక్కన ఉన్న మొక్కలకు అవసరం లేని చోట ట్రీ-గార్డులను తీసేసి, అస్తవ్యస్తంగా పడిఉన్న ట్రీ-గార్డులను సేకరించి కొత్తగా నాటే మొక్కలకు వాడి ప్రజాధనాన్ని ఆఫీసర్లు కాపాడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.



Next Story

Most Viewed