1200 ఎకరాల భూమిపై కన్ను.. అసైన్డ్‌లకు ఎసరు పెట్టిన భూకబ్జా దారులు!

by Dishanational4 |
1200 ఎకరాల భూమిపై కన్ను.. అసైన్డ్‌లకు ఎసరు పెట్టిన భూకబ్జా దారులు!
X

దిశ, భిక్కనూరు: చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం, రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టగా.. ల్యాండ్ మాఫియా దారులకు ఆ పథకం వరంగా మారింది. పట్టాదారులకు మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. పోర్టల్‌లో నెలకొన్న లొసుగులను ముందే గుర్తించిన భూ బకాసురులు విలువైన ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతూ కోట్లు గడిస్తున్నారు. ఎకరా.. రెండెకరాల పట్టా భూమి ఉన్న చోట అసైన్డ్ భూమి ఉంటే చాలు.. గద్దల వాలిపోతూ పెద్ద మొత్తంలో రేటు పెట్టి భూములను కొనుగోలు చేస్తున్నారు.

ఆ తర్వాత వారికున్న పరపతితో కింది స్థాయి నుంచి.. పై స్థాయి వరకు పరపతి పలుకుబడిని ఉపయోగించి క్రమంగా అసైన్డ్ భూములను తమ ఆధీనంలోకి తీసుకుంటూ వెంచర్లు, ఫామ్ హౌస్‌లు కడుతూ బౌండరీలు చేసుకుంటున్నారు. యదేచ్చగా సాగుతున్న ల్యాండ్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుండడం.. అధికారులు చూసి చూడనట్లు ఉండడంవల్ల కోట్ల విలువైన అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారు. "దిశ"లో వస్తున్న వరుస కథనాలతో ల్యాండ్ మాఫియా దారులైన కొందరిలో గుబులు పుట్టిస్తున్నాయి.

బయట పడిందిలా..

భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని 237 సర్వే నెంబర్‌లో 1200 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములకు కొద్ది దూరంలో పట్టా భూములు ఉండడం.. 20 సంవత్సరాల క్రితం అసైన్డ్ భూమిని ఒక కుటుంబానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అసైన్డ్ పట్టా చేసిచ్చారు. అప్పటి నుంచి అసైన్డ్ పట్టాదారుడు ఆ స్థలంలో కబ్జాదారుడుగా ఉన్నాడు. ఉన్నట్టుండి ఒక పట్టాదారుడు ఆ స్థలంలో ఉన్న రేకుల గదులను జేసీబీ సహాయంతో కూల్చివేయడం, అక్కడ రాద్ధాంతం జరగడంతో ఫిర్యాదు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. అయినా డోంట్ కేర్ అంటూ రాళ్లురప్పలను చదును చేస్తుండడం,చివరకు డంపింగ్ యార్డ్ కూల్చే పరిస్థితికి రావడంతో గ్రామస్తులు ఎంటరై అడ్డుకున్నారు.

ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అప్పటి కప్పుడు డీపీఓ, డీపీఓ, తహసీల్దార్, ఎంపీఓ, సచివాలయ కార్యదర్శి ఆ ప్రాంతానికి చేరుకొని పనులను నిలిపి వేయించారు. మూడు ఎకరాలపై చిలుకు పట్టా చేసుకుంటే అంతకు రెండింతల ఎకరాల వరకు.. రాళ్లురప్పలను తొలగించడమే కాకుండా భూమిని చదును చేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించి అధికారులను ప్రశ్నించారు. పైగా ఆయన వద్ద ఉన్న పట్టా భూమికి ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డ్ స్థలానికి ఎటువంటి సంబంధం లేదని గ్రామస్తులు వాదించారు.

అప్పట్లోనే జాతీయ రహదారికి కేటాయింపు..

సర్వే నెంబర్ 219, 220, 221 పట్టా భూములు ఏళ్ల కిందట జాతీయ రహదారి కోసం కొంత భాగం భూమిని సేకరించి జాతీయ రహదారికి కేటాయించారు. ఏడవ నెంబర్ జాతీయ రహదారిగా ఉన్న సమయంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భూములు కోల్పోయిన బాధితులకు అప్పట్లో పరిహారం కూడా అందజేశారు. అయితే 221 పట్టా భూమిలో 6.08 భూమి ఉండగా.. 33 గుంటల భూమి ఒకసారి ఆ తర్వాత జరిగిన 44వ జాతీయ రహదారి విస్తరణ పనుల్లో ఇదే సర్వే నెంబర్ నుంచి 11 గుంటల భూమి పోగా 5.04 ఎకరాల భూమి మిగిలింది. అయితే ఒక్క గుంట భూమి కూడా విస్తరణ పనుల్లో పోలేదని ధరణి రికార్డు నక్షలో ఉండటంతో దాని ఆధారంగా జిల్లా సర్వేయర్ సర్వే నిర్వహించి హద్దులు పాతించారు. ఇదే స్థలంలో డంపింగ్ యార్డ్ ఉండడం గమనార్హం. కాగా పట్టాదారులు పోయిన నెల 6న సర్వే కోసం దరఖాస్తు చేసుకోగా.. గత సంవత్సరం డిసెంబర్ 5న సర్వే చేయడం కొత్త ట్విస్ట్. ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకుని నెలల తరబడి ఎదురు చూడగా.. రాని సర్వేయర్లు దరఖాస్తుకు నెల రోజుల ముందే వచ్చి సర్వే చేయడం పలు అనుమానాలకు బలం చేకూరినట్లు అయ్యింది.

అధికారుల మౌనం..

కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాదార్ల పాలవుతున్నాయని తెలిసినా ఉన్నతాధికారులు మాత్రం కించిత్తు పట్టింపు లేనట్లుగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


Next Story

Most Viewed