కలెక్టరేట్ ను ముట్టడించిన ఎన్ఎస్యూఐ నాయకులు..

by Disha Web Desk 20 |
కలెక్టరేట్ ను ముట్టడించిన ఎన్ఎస్యూఐ నాయకులు..
X

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చెస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకు ముందు కార్యాలయం గేట్ ఎదుట ఎన్ఎస్యూఐ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోనికి చొచ్చుకుపోయేందుకు ఎన్ఎస్యూఐ నాయకులు ప్రయత్నించారు. కలెక్టర్ కార్యాలయం గేటు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎన్ఎస్యూఐ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు ఎన్ఎస్యూఐ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులతో ఎన్ఎస్యూఐ నాయకులు వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతుందన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీలు, లిక్కర్ స్కాములు చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed