'పదేళ్ళు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి'

by Vinod kumar |
పదేళ్ళు కేసీఆర్‌కు అవకాశం ఇచ్చారు.. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ రావాలని అనుకుంటున్నారని ఇదే మంచి సమయమని పదేళ్ళు కేసీఆర్ అవకాశం ఇచ్చారని కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. సోమవారం నిజామాబాద్ నగరంలోని వినాయక నగర్, మాలపల్లి. పీల స్కూల్ వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ పట్టణంలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. నిజామాబాద్‌లో ఒక మహిళ డిగ్రీ కాలేజీ లేదని, మహిళల కోసం మహిళా రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన అని చెప్పే ఎమ్మెల్సీ కవిత తండ్రి సీఎం అయిన మహిళ కాలేజీ ఎందుకు తేలేకపోయిందని ప్రశ్నించారు. ఎందరో నిరుపేదలు ఇండ్లు లేక రోడ్లపై జీవనం సాగిస్తున్నారని కానీ కేసీఆర్ 150 గదులతో పెద్ద గడీని కట్టుకుండన్నారు.

కాంగ్రెస్ పార్టీఅధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. పదేళ్లుగా ఈ ప్రాంతానికి ఏమీ చేయని బీఆర్‌ఎస్.. ఇప్పుడు మిమ్మల్ని ఓట్లు అడగడానికి వస్తున్నారని అందుకే కారు గుర్తును బొందపెట్టాలి.. ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని, పేదింటి ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అందిస్తామన్నారు. అభివృద్ధి అంటే ఏందో నిజామాబాద్ ప్రజలకు చూపిస్తా డివైడర్లు కట్టి లైట్లు పెట్టిస్తే అభివృద్ధి కాదు ఈ మాత్రం పని ప్రతి గ్రామంలో ఒక వార్డు మెంబర్ కూడా చేసుకుంటాడన్నారు. కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ప్రకటించిన ఆరు పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అవకాశం ఇవ్వకపోయినా ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కేశ వేణు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అంతిరెడ్డి విజయ్ పాల్ రెడ్డి, ఉషా, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Next Story