ఇందూరు బరిలో కవిత!

by Disha Web Desk 9 |
ఇందూరు బరిలో కవిత!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కొంతకాలంగా సైలెంటైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో యాక్టీవ్ అయ్యారు. రెండురోజులుగా తిష్ట వేసి రాజకీయంగా దూకుడు పెంచారు. పార్టీ , కుల సంఘాల సమావేశాల్లో పాల్గొంటూ.. ప్రత్యేకంగా నేతలతో భేటీ అవుతూ బిజీబిజీగా ఉంటున్నారు. ఎమ్మెల్సీగా నాలుగున్నరేళ్ల పదవికాలం ఉండగానే జిల్లాలో ఆమె పొలిటికల్ గా ఫోకస్ పెట్టడంపై చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని జగిత్యాల జిల్లా నేతలతోనూ కవిత టచ్ లోకి వెళ్తున్నారు. ఇప్పటికే కవిత కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణం, ఆస్పత్రులు, లైబ్రెరీల్లో నిత్యాన్నదానాలు కొనసాగించడం చేశారు.

తాజాగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ మజ్జిగ పంపిణీ కేంద్రాల ద్వారా కూడా సేవలందిస్తున్నారు. రెండురోజుల కిందట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆర్మూర్ సెగ్మెంట్ లోని మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా మంత్రి మల్లారెడ్డి హాజరై.. తన ప్రసంగంలో ఎంపీగా కవితను వచ్చేసారి భారీ మెజార్టీతో గెలిపించాలని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్ లో కలకలం రేపాయి. కవిత ఎంపీగా పోటీ చేస్తారనే వాదనలకు బలం చేకూర్చినట్లయింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అర్వింద్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కౌంటర్ గా ఆమె వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి తరిమికొడుతామని చేసిన శపథం అమల్లో పెడుతుందనే చర్చ కూడా జోరందుకుంది.

ఓటమి.. లిక్కర్ స్కామ్ తో

2019లో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత జిల్లా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రధానంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలే ఆమె ఓటమికి కారణమని సీఎం కేసీఆర్ చేయించిన సర్వేలోనూ, రహస్య విచారణలోనూ తేలింది. దీంతో ఆమె జిల్లా పాలిటిక్స్ పై దృష్టి తగ్గించారు. ఇక నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత బరిలోకి దిగి గెలిచారు. ఆ తర్వాత కొంత కాలానికి పదవి కాలం ముగిసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా మరోసారి విజయం సాధించారు. అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు ప్రముఖంగా వినిపించింది. సౌత్ ఇండియా గ్రూప్ నకు కవితనే హెడ్ అంటూ ఈడీ కేసులు, చార్జీషీట్ల నేపథ్యంలో జిల్లాలో రాజకీయ కార్యకలాపాల్లో ఆమె సరిగా పాల్గొనలేదు. గతేడాది నందిపేట్ మండలం ఉమ్మెడలో లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చి వెళ్లారు. అప్పుడప్పుడు ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కు వచ్చిపోయేవారు.

కొంతకాలంగా సైలెంట్‌గా ఉండి..

ఎమ్మెల్సీ హోదాలో జెడ్పీ, మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలకు కూడా హాజరుకాలేదు. గతేడాది సెప్టెంబర్ 5న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ ఓపెనింగ్ సందర్భంగా కూడా కవిత సైలెంట్ గానే ఉండిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ కేంద్రంపై చేపట్టిన నిరసనల్లోనూ జిల్లాలో పాల్గొనలేదు. ఇటీవల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో భాగంగా ఎమ్మెల్సీ కవిత మళ్లీ జిల్లా రాజకీయాల్లోకి రావడంపై పార్టీలోనూ చర్చకు తెరలేపింది. తన పర్యటనలో భాగంగా రెడ్డి సామాజికవర్గ నేతలతో.. 2019లో ఎంపీ ఎన్నికల్లో తనకు సహకరించని నేతల ఇండ్లకు వెళ్లి కూడా కవిత భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇలా జిల్లాలో పర్యటిస్తు్న్న కవిత ఉమ్మెడలో కుటుంబ సభ్యులు నిర్మించిన ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లోనూ.. పలు రాజకీయ పార్టీల నేతల శుభకార్యాల్లోనూ పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫంక్షన్ లకు కూడా హాజరవుతుండగా మరోసారి జిల్లాలో కవిత యాక్టీవ్ రోల్ పై వాదనలకు బలం చేకూర్చింది. బుధవారం రాత్రి పద్మశాలి సంఘం నేతలతో కవిత సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నేతలతో సమావేశం ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సంకేతంగా పేర్కొంటున్నారు. 2014 నుంచి 2019 వరకు ఉమ్మడి జిల్లాతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై కవిత ఆధిపత్యం కొనసాగింది.

ఆ రెండు చోట్ల పట్టుకు ప్రయత్నాలు

ఇప్పుడు మళ్లీ యాక్టీవ్ రోల్ ద్వారా నిజామాబాద్ పార్లమెంట్ తో పాటు జహీరాబాద్ పార్లమెంట్ ప్రాంతంపైనా కవిత తన పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ షురూ అయింది.

Read more:

సీఎం సభకు జనం తరలింపు ఎలా..? నేతలకు సభ సక్సెస్‌పై టెన్షన్

ఎన్నికల వేళ కామారెడ్డిలో కుల సంఘాలకు పార్టీల ఆఫర్లు


Next Story

Most Viewed