భూభారతి పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట ఎంపిక

by Kalyani |
భూభారతి పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట ఎంపిక
X

దిశ, కామారెడ్డి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి పోర్టల్ అమలుకు పైలెట్ ప్రాజెక్టుగా కామారెడ్డి జిల్లా లింగంపేట మండలాన్ని ఎంపిక చేశారు. ఈ మండలం లో భూ సమస్యలన్నింటిని రైతుల ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయనున్నారు. ధరణి పోర్టల్ లో పరిష్కారం కానీ భూ సమస్యలన్నింటిని ప్రస్తుతం అమలు చేయనున్న భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఈనెల 17 నుంచి లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో ఈ గ్రామసభలు నిర్వహించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కార మార్గాలను కనుగొననున్నారు.

మండలంలో భూముల వివరాలు ఇలా...

భూభారతి పైలట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసిన లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇందులో 10098 సర్వే నంబర్లు ఉండగా 61175.30 ఎకరాల భూములు ఉన్నాయి కాగా 294.28 ఎకరాల భూములు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. అయితే రైతులకు సంబంధించి 21984 ఖాతాలు ఉన్నాయి. వీటికి సంబంధించి 18142 పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. మొత్తం జియోగ్రాఫికల్ ఏరియా 63426.00 ఎకరాలు. ఇందులో ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు 1199, అసైన్డ్ భూములు 12722.17 ఎకరాలు, అటవీ భూములు 2906.19 ఎకరాలు, అటవీ భూముల సర్వే నంబర్లు 278 ఉన్నాయి. కాగా 1663 పార్ట్ బి కేసెస్ ఉన్నాయి.

భూ సమస్యలు గల గ్రామాలు ఇవే...

మండలంలో భూ సమస్యలు గల గ్రామాలుగా అధికారులు వీటిని గుర్తించారు. శెట్టిపల్లి సంగారెడ్డి, పోతాయిపల్లి, మంబోజి పేట, కొండాపూర్, భవానిపేట్, మోతే, లింగంపల్లి కుర్దు గ్రామాలు ఉన్నాయి.

ఫిర్యాదుల ఆధారంగానే సమస్యల పరిష్కారం..

గ్రామాల్లో నిర్వహించనున్న గ్రామసభల్లో రైతులు చేసే ఫిర్యాదుల ఆధారంగానే సమస్యలను పరిష్కరించే వీలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ధరణిలో నమోదు కాని భూములు, భూ సమస్యలు, కోర్టు కేసులు, తదితర పెండింగ్ సమస్యలన్నింటినీ గ్రామసభల్లో గుర్తించి వాటికి భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కారం చూపనున్నారు.

భూభారతితో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు...

ధరణి పోర్టల్ లో నమోదు కాని భూములకు సంబంధించిన రైతుల సమస్యలు ప్రస్తుతం భూభారతిలో పరిష్కరిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతుండడంతో ఆ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాకపోవడంతో విసుగు చెందిన ప్రస్తుత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన భూభారతి తో పరిష్కారం అవుతాయని ప్రభుత్వమే చెబుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed