సిట్టింగ్ ఎమ్మెల్యే అనధికారిక అంత్యక్రియలు బాధాకరం..

by Disha Web Desk 20 |
సిట్టింగ్ ఎమ్మెల్యే అనధికారిక అంత్యక్రియలు బాధాకరం..
X

దిశ, బాన్సువాడ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని, ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్నను అవమానించారని బీజేపీ మండలాధ్యక్షుడు చందూర్ హన్మాండ్లు విమర్శించారు. నసుర్లాబాద్ మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అంత్యక్రియలు అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చేయకపోవడం యావత్తు దళిత సమాజాన్ని అవమానించడమేనని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో దళితుల అసైన్మెంట్ భూములను గుంజుకోవడం, నేరెళ్ల దళితులను చిత్రహింసలు పెట్టడం, భూదాన్ పోచంపల్లి భూములు గుంజుకోవడం జరిగిందన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియల విషయంలో సీఎం చేసిన తప్పిదాన్ని ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. దీని విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలు, దళిత ఎమ్మెల్యేలు స్పందించాలని, లేదంటే మీరందరూ కూడా దళిత ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, ఓబీసీ జిల్లా నాయకుడు వడ్ల సతీష్, కూనింటి రాము, సాయి కుమార్, పేరక రాములు, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed