జోరుగా అక్రమ మొరం తవ్వకాలు.. మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు

by Dishanational2 |
జోరుగా అక్రమ మొరం తవ్వకాలు.. మామూళ్ల మత్తులో మైనింగ్ అధికారులు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలు జోరుగా సాగుతున్నా మైనింగ్ అధికారులు గాని, రెవిన్యూ సిబ్బంది గాని, పట్టించుకున్న పాపాన పోలేదు. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలోని కుంటలో గత కొంత కాలంగా జోరుగా అక్రమ మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మైనింగ్ అనుమతులు అసలే లేవు. అయినా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. ట్రాక్టర్ యూనియన్ నాయకులు, మొరం తవ్వకాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న వార్డు మెంబెర్ మోసర్ల శ్రీకాంత్ రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి వీడియో‌లు చిత్రీకరించాడు. దీంతో శ్రీకాంత్ రెడ్డి అక్రమ మైనింగ్ తవ్వకాలకు అడ్డు వస్తున్నాడని వారి వ్యవసాయ పనులకు ఎవరు వెళ్లవద్దని ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అధికారుల కను సైగ లోనే ఇది అంతా జరుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ మొరం దందా పై బాధితుడు తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై ఏకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడంటే వారి ఆగడాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. మాచారెడ్డి మండలం‌లోని మంథని దేవునిపల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులుకానీ పట్టించుకున్న పాపాన పోలేదు. గత కొన్ని నెలలుగా మంథని దేవునిపల్లి నుండి ఇసాయిపేట్ వెళ్లి బిటీ రోడ్డుకు దగ్గరలోనే ఈ అక్రమ మైనింగ్ తతంగమంతా జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు చూడడం లేదు. ముడుపులు ముట్టడం వల్లనే అధికారులు ఇటువైపు రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. మంథని దేవునిపల్లి నుండి సిరిసిల్ల వెళ్లే మెయిన్ రోడ్డు పైనే ఉన్న వెంచర్‌లోకి ఈ అక్రమ మోరాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ఫోన్ ఎత్తరు.. స్పందించరు..

మంథని దేవుని పల్లిలో జరుగుతున్న ఈ అక్రమ దందా గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే వారు ఫోన్ ఎత్తరు స్పందించరు అని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్న ఓ గ్రామ ప్రజా ప్రతినిధి‌కి చెందినది కావడం వల్లనే రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి మండలం‌లోని రాఘవపూర్ గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇక్కడ అక్రమ మైనింగ్ చేసే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా ఇదే దందాను కొనసాగిస్తున్నాడు. అధికారుల అండదండలతోనే తన అక్రమ వ్యాపారాన్ని దశలుగా విస్తరిస్తున్నాడు. బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో కొన్ని సంవత్సరాల నుండి ఓ వ్యక్తి అక్రమ మొరం తవ్వకాలను చేపడుతున్నారు. ఆ వ్యక్తి దగ్గర మండలంలోని మైనింగ్, రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా చేయడంలో సహాయపడుతున్నారు. వారి అండదండలతోనే అక్రమ మొరం తవ్వకాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగే విధంగా చూస్తున్నారు. అక్రమంగా మైనింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్తే వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ప్రజలు బాహాటంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అక్రమ దందా గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వస్తున్నాం చూస్తున్నాం అంటూ కాలయాపన చేసి అక్రమార్కులు అక్కడి నుండి తప్పించుకునే విధంగా చేస్తున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

అక్రమ మైనింగ్‌లో అధికారులకు వాటాలు

జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు అండగా నిలిచినందుకు కొందరు మైనింగ్ సిబ్బందికి ,రెవెన్యూ అధికారులకు వాటాలు ఇస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అందుకే జోరుగా అక్రమ తవ్వకాలు జరిగిన మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారంలో రాత్రి పగలు అంటూ తేడా లేకుండా నిరంతరాయంగా జరుగుతున్న అధికారులు స్పందించడం లేదు. ఎన్నో అక్రమాలు జరుగుతున్న మామూళ్ల మత్తులో చూసిచూడనట్లు వివరిస్తున్న రెవిన్యూ అధికారులపై కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై మైనింగ్ ఏడి నర్సిరెడ్డి వివరణ కోరగా ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే ఆ ప్రాంతానికి వెళ్లి కేసులు నమోదు చేస్తామన్నారు. ఆయా ప్రాంతాలలో గతంలో కొన్ని కేసులు నమోదు చేశామని, తమకు సమాచారం అందిన ప్రాంతాల్లో రోజు తనిఖీలు చేపడుతున్నామని అన్నారు.


Next Story

Most Viewed