ఆ పాఠశాలలో ఆకలి కేకలు..

by Disha Web Desk 20 |
ఆ పాఠశాలలో ఆకలి కేకలు..
X

దిశ, నాగిరెడ్డిపేట్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మధ్యాహ్న భోజన పథకం కొంతమంది అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అబాసు పాలవుతోంది. దీనికి నిదర్శనమే కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. తాండూరు గ్రామం అనాది నుండి దీటైన రాజకీయాలకు పుట్టినిల్లు లాంటిది. మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ కూడా ఈ గ్రామం నుండే ఎమ్మెల్యే, ఎంపీపీ ఇతర ఉన్నత పదవులను అధిరోహించిన వారు ఎంతో మంది ఉన్నారు. కానీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులకు మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంలో విఫలం అవుతున్నారు.

విద్యార్థులు చేసుకున్న పాపం ఏమిటో కానీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022 విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుండి నేటి వరకు మధ్యాహ్న భోజనం అమలు కాక విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. పాఠశాలలో 129 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గత విద్యా సంవత్సరం నుండి మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు బిల్లులు సక్రమంగా మంజూరు కాకపోవడంతో, మధ్యాహ్న భోజన ఏజెన్సీ దారులు పాఠశాలలో వంట చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇళ్ల నుండి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటుండగా, పేద కుటుంబాల విద్యార్థులు మాత్రం టిఫిన్ బాక్సులు తెచ్చుకోలేక, ఇంటికి వెళ్లి తినలేక సాయంత్రం వరకు పాఠశాలలోనే ఆకలితో అలమటిస్తూ పస్తులుంటున్నారు.

మధ్యాహ్న భోజన పథకం అమలులో విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం..

ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలే చదువుకుంటారు. అలాంటి పాఠశాలలో గత మూడు నెలలుగా మధ్యాహ్న భోజనం అమలు కాకపోయినప్పటికీ, విద్యాశాఖ అధికారులకు గాని, ప్రజాప్రతినిధుల గాని చీమ కుట్టినట్లయినా లేదని, వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే బాధలేమిటో తెలుస్తాయని, అధికారులు, ప్రజా ప్రతినిధులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాండూర్ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయడానికి మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరూ ముందుకు రావడం లేదని, ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు మండల విద్యాధికారి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా జిల్లా విద్యాధికారి, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది.

జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారులు కూడా గ్రామ సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు జరిగేలా చూడాలని చెప్పి చేతులు దులుపుకున్నారే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి గట్టి చర్యలు చేపట్టలేదని, మధ్యాహ్న భోజన అమలు తీరు పై మండల విద్యాధికారి పర్యవేక్షణ కరువైందని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అసలు జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారా ? ఉంటే ఇలా పేద విద్యార్థుల కడుపు కొట్టే పనులు ఎందుకు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తోపాటు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి, విద్యార్థుల ఆకలిదప్పులు తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు కోరుతున్నారు.


Next Story

Most Viewed