తలుపులు తెరిచిన హస్తం పార్టీ.. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన

by Aamani |
తలుపులు తెరిచిన హస్తం పార్టీ.. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహ రచన
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తవడం, మరో పక్క త్వరలో స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక సమరంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చాకచక్యంగా వ్యూహరచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లకు నామినేటెడ్ పదవుల్లో సెట్ చేసి బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లోని బలమైన నాయకులు, లోకల్ లీడర్లను హస్తం వైపు లాక్కుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు బీఆర్ఎస్ ,బీజేపీల్లో ఉన్న బలమైన నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకు తలుపులు బార్లా తెరిచి ఉంచింది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని, స్థానిక సంస్థల్లో, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్ లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఉన్న బలమైన లీడర్లను కాంగ్రెస్ లోకి లాక్కుని వారినే పోటీలో నిలిపి అన్ని స్థానాల్లో పాగా వేసేలా ప్లాన్ చేస్తోంది. గ్రామ పంచాయతీ స్థాయి నుంచి, మున్సిపల్, కార్పొరేషన్, నియోజకవర్గ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉపయోగపడతారనుకున్న లీడర్లు, కార్యకర్తలందరికీ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన మొదట్లో బీఆర్ఎస్ ను వీడి చాలా మంది కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ (ప్రస్తుత చైర్మన్) రమేశ్ రెడ్డి, భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, ఆమె భర్త కన్నె సురేందర్, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియ, నిజామాబాద్, బోధన్ నియోజకవర్గంలో ఇతర పార్టీల కార్పొరేటర్లు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన కుడుముల సత్యనారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపినప్పటికీ పార్టీలో సీనియర్ల నుంచి వచ్చిన వ్యతిరేకత కారణంగా పార్టీలోకి వలసలను తాత్కాలికంగా నిలుపుదల చేసిన కాంగ్రెస్ పార్టీ తాజాగా తన పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రజాదరణ కలిగిన బలమైన నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ పార్టీ లోకి డోర్లు బార్లా తెరిచింది.

పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాపై ప్రత్యేక దృష్టి

పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడు కావడంతో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్ట పరచడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను బలహీన పరిచి ఆ పార్టీలను స్థానిక సంస్థల ఎన్నికల్లో నిర్వీర్యం చేయాలని, మెజారిటీ సీట్లను గెలుచుకుని కార్పొరేషన్ తోపాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఎంపీటీసీ,జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవడానికి భారీ స్కెచ్ చే వేస్తోంది. ఇవే కాకుండా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని జడ్పీలను, రెండు జిల్లాల్లోని ఎంపీపీ స్థానాలను కూడా గెలిచి సత్తా చాటేందుకు అవసరమైన వ్యూహరచన చేస్తుంది. ఇందులో భాగంగానే చాపకింద నీరులా బీఆర్ఎస్ ,బీజేపీల్లోని బలమైన నాయకులకు గాలం వేస్తోంది. దీని కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్వయంగా రంగంలోకి దిగి తన రాజకీయ చతురతను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకునే క్రమంలో సీనియర్ల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురు కుండా ఉండేందుకు పథకం ప్రకారమే పార్టీలో సీనియారిటీ ఉన్న ప్రజాబలం అంతగా లేక ఎన్నికల్లో గెలిచే సత్తా అంతగా లేని నాయకులకు నామినేటెడ్ పదవుల్లో సెట్ చేసి వారి నుంచి వచ్చే వ్యతిరేకతకు అడ్డు కట్ట వేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొంత మంది సీనియర్లకు పలు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. మరి కొందరికి వివిధ స్థానాల్లో కూర్చోబెట్టారు. మొత్తానికి పార్టీలోకి ఇతర పార్టీల నుంచి ఎవరిని తీసుకున్న ఎలాంటి వ్యతిరేకత రాకుండా, స్థానిక సంస్థలు, కార్పొరేషన్,మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పకడ్బందీగా వ్యూహరచన చేస్తుంది.

ప్రజల్లో కూడా మద్దతు చేజారకుండా..

ఓ పక్క ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తూ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా ప్రజల్లో పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు చేజారకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవడంతో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటోంది. ఏడాది కాలంలో ప్రభుత్వం నెరవేర్చిన హామీలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు ఒనగూరిన ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తోంది. ఇదివరకు రెండు టర్మ్ లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్ల కాలంలో చేయలేని అభివృద్ధిని, రైతుకు అందించలేని సంక్షేమాన్ని, ప్రయోజనాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే చేసి చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చాటి చెపుతున్నారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలే ఇచ్చిందని, కానీ ఈ ఏడాది కాలంలో 160 హామీలు అమలు చేశామని చెబుతున్నారు. ఓ పక్క బీఆర్ఎస్, మరో పక్క బీజేపీ పార్టీలు ప్రభుత్వ పని తీరును వ్యతిరేకిస్తున్న, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శిస్తున్న పట్టించుకోవడం లేదు. తామేం చేశామన్నది ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తోంది. ప్రజాపాలన విజయోత్సవ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు అందరూ ప్రభుత్వం పనితీరును ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed