- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
ఊరిస్తున్న పదవులు..రాజకీయ వర్గాల్లో అయోమయ పరిస్థితులు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రెండు జాతీయ పార్టీలకు చెందిన నేతలకు రాష్ట్ర స్థాయి పదవులు కొంతకాలంగా ఊరిస్తున్నాయి. అప్పుడు ఇప్పుడు ఖరారవుతున్నాయంటూ ఊహాగానాలతో కాలం వెలిబుచ్చుతున్నారు. ఆ పదవుల కోసం నేతల ఎదురు చూపుల్లో ఉన్న.. వారి పార్టీ అనుచరులు, అభిమానులు మాత్రం వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు. తమ నేతకు ఈ పదవి, కిరీటం దక్కుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. ఎక్కడ లేని భరోసా వ్యక్తం చేస్తున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. పదవులకు పోటీ పెరుగుతుంది. పెరిగిన పోటీ సమీకరణాల దృష్ట్యా ఎవరికి పదవులు వరిస్తాయి ఎవరికి మొండిచేయి చూపిస్తాయో అర్థం కాని పరిస్థితి నెలకొనడం ఆ నేతలకు, వారి అనుచరులకే కాదు..రాజకీయవర్గాల్లోనూ అయోమయ పరిస్థితులను కల్పిస్తున్నాయి. ఈ విషయాలన్నీ ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ చర్చకు దారి తీస్తున్నాయి.
బీజేపీ లో అర్వింద్ ధర్మపురి..
జీజేపీ లో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఫైర్ బ్రాండ్ అన్న సంగతి వేరే చెప్పక్కర్లేదు.మాజీ మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించిన స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కొడుకుగా ఎంతో ఘనమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం అర్వింద్ సొంతం. అలాంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అర్వింద్ రాజకీయ అరంగేట్రం చేసేనాటికి ఎక్కడ రాజకీయంగా తను కనిపించింది లేదు. ఆ పేరు వినిపించింది లేదు. వచ్చీ రావడంతోనే ప్రధాని మోదీ భక్తుడిగా తనను తాను పరిచయం చేసుకుని బీజేపీలో చేరడం, వస్తూ వస్తూనే సునామీలా దూసుకొచ్చి పసుపు బోర్డు ఏర్పాటు హామీతో ఎంపీగా పోటీ చేయడం, సాక్షాత్తు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితనే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి ఎంపీ గా గెలవడంతో అర్వింద్ పేరు దేశమంతా మార్మోగిపోయింది. తరువాత తన పదునైన మాటలు, సూటి విమర్శలతో కేసీఆర్, కేటీఆర్ లతో పాటు బీఆర్ఎస్ నేతలను ముప్పుతిప్పలు పెట్టిన అర్వింద్ అనతికాలంలోనే బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు.
రెండోసారి ఎంపీగా గెలిచాక పసుపు బోర్డును సాధించి తీసుకొచ్చి ప్రజల్లో కూడా తన మాటిస్తే నిలబడతాడని ప్రూవ్ చేసుకున్నాడు. గత కొంత కాలంగా అర్వింద్ ధర్మపురి ఫోకస్ స్టేట్ బీజేపీ చీఫ్ పదవి పైనే ఉందని, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగింది. ఒక దశలో పార్టీని గెలిపించే దమ్మున్నోడే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండాలంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఉన్నదున్నట్లు మనసులో ఏది దాచుకోకుండా సొంత పార్టీలో జరిగే తప్పొప్పులపై కూడా పలుమార్లు కుండ బద్దలు కొట్టిన అర్వింద్ మాటలు పార్టీలో తీవ్ర చర్చకు దారి చేసినప్పటికీ ఆయన తన వ్యాఖ్యలపై ఎక్కడా తగ్గలేదు. అర్వింద్ లోని దూకుడు తను రాజకీయాల్లోకి అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా ఆయన తీరు మారలేదు సరికదా.. తనపై బీఆర్ఎస్ నేతలు పలుమార్లు దాడులు జరిపినా తన విమర్శల్లో పదును ఎక్కడా తగ్గించలేదు..పైగా కేసీఆర్ ఫ్యామిలీ లీడర్లకు ముచ్చెమటలు పట్టించారు. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్వింద్ ను ఓ స్టేట్ లీడర్ గా మార్చాయి. బీజేపీ స్టేట్ చీఫ్ గా బండి సంజయ్ తరువాత ఆ పార్టీ చీఫ్ గా కిషన్ రెడ్డి రావడం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఆశించిన మేర ఫలితాలను సాధించకపోవడంతో అర్వింద్ సందర్భోచితంగా తన అభిప్రాయాలను సొంత పార్టీ నేతలనే ఇబ్బందులనుపెట్టేలా సూటిగా చెప్పారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించే అర్వింద్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పార్టీలో చర్చ మొదలైంది. అప్పటి నుండే అర్వింద్ స్టేట్ పార్టీ చీఫ్ గా సరైనోడనే అభిప్రాయాలు పార్టీలో బహిరంగంగా వినిపించడం మొదలయ్యాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోటీకి గతంలో ఎందరు పోటీ పడిన తాజాగా పోటీ ఈటల రాజెందర్, అర్వింద్ ధర్మపురి మధ్యలోనే ఉందని రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.ఇటీవల బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ స్టేట్ చీఫ్ గా ఎవరైనా కావొచ్చని, పోటీలో ఈటెల రాజేందర్ కూడా ఉన్నారని చెప్పారు.గతంలో అర్వింద్ చేసిన వ్యాఖ్యలు కిషన్ రెడ్డిని దృష్టిలో ఉంచుకుని చేశారని, వాటిని కిషన్ రెడ్డి మనసులో పెట్టుకుని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదవి కోసం జరుగుతున్నటఫ్ ఫైట్ కిషన్ రెడ్డి ఈటెల కు సపోర్ట్ చేస్తున్నాడేమోననే అనుమానాలు జిల్లాలో బీజేపీ నేతలు,కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.మరో పక్క బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బరిలో బలంగా ఉన్న అర్వింద్ ను బుజ్జగించేందుకే పసుపు బోర్డునిచ్చారనే ప్రచారం జరుగుతోంది. పసుపు బోర్డును ఇచ్చి ఈసారికి ఈటెల ను స్టేట్ చీఫ్ ను చేసే ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఏది ఎలా ఉన్నా అర్వింద్ ఈ విషయంలో ఎలాంటి ఆలోచన లేకుండా ఉన్నారని, అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకునే ధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై ఎంపీ అర్వింద్ ను దిశ ఫోన్ లో సంప్రదించగా, తను పార్టీకి పని చేయడం తప్ప పదవుల గురించి ఆలోచించనన్నారు.ఇప్పుడు కూడా తాను ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అప్పజెప్పిన రెండు నియోజకవర్గాల్లో పార్టీని గెలిపించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. తను ఎప్పుడు బీజేపీ స్టేట్ చీఫ్ కావాలని ఎవరిని అడగలేదన్నారు. తను పార్టీకి కార్యకర్తలా పనిచేయడమే తనకు తెలుసని అర్వింద్ అన్నారు.
మరో పక్క బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని ఏడాది కాలంగా మంత్రి పదవి ఊరిస్తూ వస్తుంది తప్ప ఆయనను ఇప్పటికీ వరించింది లేదు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం వచ్చిందంటూ రెండు సార్లు ప్రచారం జరిగినప్పటికీ అది రాలేదు. ఇప్పటికీ ఆ ముహూర్తం రాకపోవడంతో సుదర్శన్ రెడ్డి తీవ్ర నిరాశలోఉన్నట్లు ఆయన అనుచరులు చెపుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు, పలుమార్లు కేబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవమున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి.ఇప్పుడున్న నాయకుల్లో మహమ్మద్ అలీ షబ్బీర్ ఒక్కరే ఆయన సమకాలీనుడని చెప్పవచ్చు.
ఉమ్మడి జిల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావులు కొత్తగా ఎన్నికైన వారు కాగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరే సీనియర్ నేత. ఏ రకంగా చూసుకున్నా తనకే మంత్రి పదవి వస్తుందన్న పూర్తి విశ్వాసంతో సుదర్శన్ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధినాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ సారి సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఖాయంగా వరించేలా ఉందనే ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు వేర్వేరు పార్టీల సమర్థవంతమైన నాయకులకు ఈ వారంలోనే పదవులు వరించే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది.