ట్రేడ్ లైసెన్స్ ల ముసుగులో వసూళ్లు..

by Disha Web Desk 20 |
ట్రేడ్ లైసెన్స్ ల ముసుగులో వసూళ్లు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బల్దియా పరిధిలో వ్యాపారం చేసుకునే వారికి మంజూరు చేసే ట్రేడ్ లైసెన్స్ లు కొందరి పాలిట కల్పతరువుగా మారాయి. సానిటరి ఇన్స్ పెక్టర్ లను ముందు పెట్టి వసూల్ చేసే కార్యక్రమం జోరుగా సాగుతుంది. బల్దియాకు రావాల్సిన ఆదాయాన్ని గండికొడుతున్నారు. అధికారికంగా మున్సిపల్ కార్పొరేషన్ తరపున జారీ కావాల్సిన ట్రేడ్ లైసెన్స్ ల కోసం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు వసూల్ చేస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా రూపాంతరం చెందిన తర్వాత నిజామాబాద్ కు సానిటరి ఇన్స్ పెక్టర్ లు కరువయ్యారు.

సానిటరి ఇన్స్ పెక్టర్ లుగా వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ వచ్చిన వారు కొనసాగుతున్నారు. సానిటరి ఇన్స్ పెక్టర్ల పోస్టులను భర్తీ చేస్తలేరని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఎస్సైలుగా నియమించారు. వారికి బల్దియాపై అవగాహన లేకపోయినా కేవలం వసూళ్ల దందాలో ఆరితేరిపోయారని విమర్శలు మూటగట్టుకున్నారు. బల్దియాలో పని చేసే ఉద్యోగుల అటెండెన్స్ విషయంలో , ఫాగింగ్, చెత్త లిఫ్టింగ్ విషయంలో బలవంతపు వసూళ్లను చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా నిజామాబాద్ బల్దియాలో ట్రేడ్ లైసెన్స్ ల వ్యవహరంలో ముక్కుపిండి వ్యాపారుల వద్ద వసూల్ చేసే కార్యక్రమం జోరుగా సాగుతుంది.

ట్రేడ్ లైసెన్స్ ల మంజూరి విషయంలో ఇప్పటి వరకు కార్పొరేషన్ అధికారులు నిర్ధిష్ట నియమనిబంధనలు ప్రకటించలేదు. ఎంత గ్రేడ్ లైసెన్స్ ఫీజు అనేది ఇప్పటికి ఎవ్వరికి తెలియదు. ట్రేడ్ లైసెన్స్ ల కోసం బల్దియా సిబ్బంది మంజూరి విషయంలో చేస్తున్న హడావుడికి డిపార్ట్ మెంట్ లెక్కలకు సంబంధం లేకుండా ఉంది. సంబంధిత వ్యాపార సముదాయాల విస్తీర్ణం, కొలతలతో పాటు సానిటరి చార్జీలు, ఇతర చార్జీలు కచ్చితంగా చెల్లించాలని అప్పుడు లక్షల్లో బల్దియాకు కట్టాల్సి ఉంటుందని వసూళ్ల కార్యక్రమం తెరలేపారు. వసూళ్ల కార్యక్రమం కొరకు సానిటరి ఇన్స్ పెక్టర్ లు ప్రైవేట్ వ్యక్తులతో దందాను నడిపించడం గమనార్హం.

ఇటీవల కాలంలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో అనర్హులకు పోస్టింగ్ లు ఇప్పించిన కొందరు తెర వెనుక ఉండి ఈ తతంగాన్ని నడిపించడం నిజామాబాద్ బల్దియాకు అవినీతి మచ్చలు తెచ్చేలా ఉంది.నిజామాబాద్ కు కొత్తగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఒక ఎస్సై బహిరంగంగానే ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో డబ్బులు వసూల్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. కానీ బల్దియాపై శాశ్వత అధికారులు లేక ఇంచార్జి అధికారుల ఆధ్వర్యంలో అతనిపై చర్యలు తీసుకోలేదు. దాంతో అతను పారిశుధ్య కార్యక్రమాల కంటే ట్రేడ్ లైసెన్స్ ల విషయంలోనే నిక్కచ్చిగా ఉండి అందిన కాడికి వెనుకేసుకుంటున్నారని అంతట కోడైకూస్తోంది. బల్ధియాలో ఒకరిద్దరు కాదని ఎస్సైలు మొదలుకుని జవాన్ల వరకు ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో వ్యాపారులను పీల్చి పిప్పిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిజామాబాద్ బల్దియాలో కొత్తగా ఇంటి నిర్మాణాలు, అపార్ట్ మెంట్ల పర్మిషన్లు పేరుకు టౌన్ ప్లానింగ్ అనుమతి అయినా లోకల్ కార్పొరేటర్ ఒకే చెబితేనే పర్మిషన్ గ్రాంటెడ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో రియల్ భూం తగ్గడంతో పాటు చాలా మంది నిర్మాణాలకు వెనుకడుగు వేయడంతో కార్పొరేటర్ల నజర్ ట్రేడ్ లైసెన్స్ ల వైపు మళ్లింది. బల్దియాలో కొత్తగా దుకాణం ఏర్పాటయిందంటే అక్కడికి సానిటరి ఇన్స్ పెక్టర్ ను, జవాను పంపించి ట్రేడ్ లైసెన్స్ గురించి వాకబు చేయడం, అందిన కాడికి దండుకోవడం జోరుగా సాగుతుంది. కమర్షియల్ ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ లు జారీ కార్పొరేటర్ల పాలిట కల్పతరువు అని చెప్పాలి.

వాణిజ్య ప్రాంతాల్లో లైసెన్స్ ల కొరకు ఎవ్వరు చెప్పినా వినకుండానే బలవంతపు వసూళ్లు చేయడం అధికార పార్టీ కార్పొరేటర్లకే చెల్లిందని చెప్పాలి. ఇటీవల కాలంలో బీజేపీ నుంచి వచ్చిన కార్పొరేటర్ ఏకంగా తన బంధువుని ట్రేడ్ లైసెన్స్ ల జారీ కొరకు వసూళ్ల పర్వాన్ని తెరదీయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నగరంలోని ఖలీల్ వాడిలో గతంలో వైద్యులను లైసెన్స్ ల విషయంలో వేదించడంతో వారు కోర్టును ఆశ్రయించడంతో కార్పొరేటర్ల దోపిడికి గండిపడింది. దాంతో కమర్షియల్ బిజినెస్ జరిగే ప్రాంతాల్లో ట్రేడ్ లైసెన్స్ ల పేరుతో లక్షలాది రూపాయలు వసూల్ చేస్తున్నారు. ఇప్పటికే మూడేళ్ల పదవి కాలం ముగిసిందని రానున్న రెండేళ్లలో నాలుగు రాళ్ళు వేసుకేసుకోవాలని తెర వెనుక వసూళ్ల కార్యక్రమం జోరుగా సాగిస్తున్నారు.


Next Story

Most Viewed