బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తావా అని బీజేపీ కార్యకర్తల బెదిరింపు...ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తావా అని బీజేపీ కార్యకర్తల బెదిరింపు...ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్నావని, ఎన్నికలు ముగిసిన తర్వాత నీ అంతు చూస్తామని కొందరు బెదిరించడంతో సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగు చూసింది. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన తోనిగండ్ల రాజాగౌడ్ (45) తమ గ్రామంలో ఇటీవల ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రచారం చేశారరు. ఈ విషయం అదే గ్రామంలో బీజేపీకి చెందిన

ఈర్ల లక్ష్మీప్రసన్న, నర్సు, మధు మహేంధర్ లకు నచ్చలేదు. వారు నీవు వేరే పార్టీకి ప్రచారం చేస్తున్నావు, ఎన్నికలైన తర్వాత నీ అంతు చూస్తాం, చంపుతామని బెదిరించారు. దాంతో పోలింగ్ జరిగిన గురువారం మధ్యాహ్నం రాజాగౌడ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించినా లభించలేదు. శుక్రవారం ఉదయం బెజ్జోరా గ్రామ శివారులోని దేవీగుడి వద్ద రాజాగౌడ్ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయంపై అతని కుటుంబ సభ్యులు తోనిగండ్ల రవీందర్ భీంగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీజేపీకి చెందిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు భీంగల్ ఎస్సై హరిబాబు తెలిపారు.

Next Story