కాంగ్రెస్ కు భారీ షాక్.. వైఎస్ఆర్టీపీలో చేరిన ఎల్లారెడ్డి నేత జమునా రాథోడ్

by Disha Web Desk 11 |
కాంగ్రెస్ కు భారీ షాక్.. వైఎస్ఆర్టీపీలో చేరిన ఎల్లారెడ్డి నేత జమునా రాథోడ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కు పెద్ద షాక్ తగిలింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీలో ముఖ్య నాయకురాలుగా కొనసాగుతున్న జమునా రాథోడ్ వైఎస్ షర్మిల సమక్షంలో వైఎస్ఆర్టీపీలో చేరారు. సోమవారం వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిలతో జమునా రాథోడ్ ఆమె భర్త వెంకట్ భేటి అయ్యారు. అందులో భాగంగానే పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలతో భార్యాభర్తలిద్దరూ భేటి అయిన తర్వాత షర్మిల సమక్షంలో వైఎస్ఆర్టీపీలో చేరినట్లు తెలుస్తోంది. కామరెడ్డి జిల్లాకే చెందిన వైఎస్ఆర్టీపీ నాయకులు నీలం రమేష్, జమునా రాథోడ్ ను పార్టీలోకి తేవడంలో సఫలం అయ్యారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తూ కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పని చేస్తూ తనకంటూ ఓ క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్న జమునా రాథోడ్ పార్టీ మారడంతో ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

గత కొద్దికాలంగా జమునా రాథోడ్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారని, పార్టీ మారడం ఖాయమని ప్రచారం జోరుగా సాగింది. కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలకు తోడు ఎల్లారెడ్డి టికెట్ తనకు వస్తుందో లేదో అన్న సంశయంలో జమునా రాథోడ్ ఉన్నట్లు చర్చ జరిగింది. ఎల్లారెడ్డి సెగ్మేంట్ లో కాంగ్రెస్ మూడు ముక్కలాట సాగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. దానికి ఆజ్యం పోస్తూ పార్టీ కార్యక్రమాలను ఎవరికి వారుగానే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు ఎవరికి వారే అన్నట్టుగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. దాంతో పార్టీలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే పార్టీ పెద్దల దృష్టికి ఎల్లారెడ్డి నియోజకవర్గ విభేదాల అంశం చేరినట్టుగా తెలుస్తోంది. ఆ విబేధాలతోనే జమునా రాథోడ్ పార్టీ మారినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఎల్లారెడ్డిలో జరిగిన రేవంత్ రెడ్డి బహిరంగసభలో పార్టీలో ఉన్న విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గడిచిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకోగా ఒక్క ఎల్లారెడ్డి మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది. కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన జాజాల సురేందర్ నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేరారు. వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నారు. గతంలో జహీరాబాద్ పార్లమెంటుకు పోటీ చేసి అత్యల్ప మెజారిటీతో ఓటమి పాలైన మదన్ మోహన్ రావు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అలాగే తనకు కూడా అవకాశం లభిస్తుందన్న ఆశతో జమునా రాథోడ్ సైతం టికెట్ పై ఆశ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తనకు టికెట్ వస్తుందన్న నమ్మకం లేకపోవడంతోనే జమునా రాథోడ్ పార్టీ మారిననట్లు చెప్పుకుంటున్నారు.



Next Story

Most Viewed